కై లాస్‌నగర్: ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకింగ్ విధానంలో మార్పు చేసింది. పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్‌లైన్‌లో కూపన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర వైస్‌చైర్మన్, ఎండీ భవేష్ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 1నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
మ్యానువల్ విధానానికి స్వస్తి..
ప్రస్తుతం జిల్లాలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోంది. సమీప వాగులు, పెన్‌గంగ నుంచి గృహ నిర్మాణదారులు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ప్రైవేట్ నిర్మాణాలకు మాత్రం ఒక్కో ట్రాక్టర్ ట్రిప్‌కు రూ.400 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ట్రాక్టర్ల యజమానులు జిల్లా మైనింగ్ శాఖ నిర్దేశించిన కలెక్టర్ అకౌంట్‌కు పంపిస్తారు. మీసేవ నుంచి ఆ నగదు చెల్లింపునకు సంబంధించిన ప్రింటౌట్ తీసుకుని సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తారు. వాటిని తహసీల్దార్ ధ్రువీకరించిన అనంతరం ఆర్‌ఐలు బుకింగ్ కూపన్లు జారీ చేస్తారు. వాటి ద్వారా ట్రాక్టర్ యజమానులు ఇసుక తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ కూపన్ల జారీలోనూ అక్రమాలు జరుగుతున్నట్లుగా ప్రభుత్వం భావించింది. ఒక ట్రిప్పు అనుమతి తీసుకుని నాలుగైదు ట్రిప్పుల వరకు తరలిస్తున్నట్లుగా గుర్తించింది. ఇలాంటి వాటికి చెక్‌పెట్టేలా బుకింగ్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది.
ఆన్‌లైన్‌లోనే అనుమతులు
ఇసుక బుకింగ్ విధానంలో మ్యానువల్ పద్ధతికి స్వస్తి పలికిన ప్రభుత్వం ఇకపై ఆన్‌లైన్‌లోనే కూపన్లు జారీ చేయాలని కలెక్టర్లు, మైనింగ్ అధికారులను ఆదేశించింది. టీజీఎంఐవీ వెబ్‌సైట్‌లో మన ఇసుక వాహనం పేరిట ప్రత్యేక ప్రొఫార్మాను అందుబాటులో ఉంచింది. ఈ అనుమతుల జారీ, పర్యవేక్షణ కోసం తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులను నోడల్ అధికారులుగా నియమించాలని ఆదేశించింది. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించిన వారికి అనుమతులు జారీ చేస్తారు. మండలాలు, గ్రామాల వారీగా ఎన్ని కూపన్లు జారీ అయ్యాయి, ఎన్ని ట్రాక్టర్ల ఇసుక తరలుతుందనే దానిపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. తద్వారా ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పడటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశముంది.
ఆన్‌లైన్‌లోనే బుకింగ్
ఇసుక బుకింగ్ విధానంలో ప్రభుత్వం మార్పు చేసింది. మ్యానువల్ సిస్టమ్ రద్దు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ‘మన ఇసుక వాహనం’ పేరిట ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర మైనింగ్ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. అమలుకు కసరత్తు చేస్తున్నాం. ఇసుక అవసరమైన వారు టీజీఎంఐవీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– ఎస్.రాజేశ్వర్, రెవెన్యూ అదనపు కలెక్టర్


