అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష | - | Sakshi
Sakshi News home page

అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష

Mar 29 2026 7:06 AM | Updated on Mar 29 2026 7:06 AM

● మూడో తరగతి విద్యార్థుల కోసం.. ● జిల్లాలో 21 పాఠశాలలు ఎంపిక ● రేపు, ఎల్లుండి నిర్వహణ

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మూడో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. తద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయి, ఉపాధ్యాయుల బోధన పనితీరు, తదితర అంశాలు వెలుగులోకి రానున్నాయి. గతంలో న్యాస్‌ (నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే)లో ప్రాథమిక స్థాయిలో జిల్లా వెనుకబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర విద్యా శాఖ అధికారులు జిల్లాపై ప్రత్యేక చొరవ చూపి సామర్థ్యాలను పెంచారు. ఇటీవల 2వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. తాజాగా మూడో తరగతి విద్యార్థులకు రేపు, ఎల్లుండి నిర్వహించనున్నారు.

21 పాఠశాలలు ఎంపిక..

జిల్లాలో 500 ప్రాథమిక, 119 ప్రాథమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈనెల 30,31 తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 12 చొప్పున మొత్తం 252 మంది హాజరుకానున్నారు. మొదటి రోజు ఒక్కో పాఠశాలలో ఆరుగురు చొప్పున, మరుసటి రోజు ఆరుగురు చొప్పున పరీక్ష ఉండనుంది. తెలుగు, గణితం, ఇంగ్లీష్‌ విభాగాల్లో సామర్థ్యాలను పరిశీలించనున్నారు.

ఇన్విజిలేటర్లుగా ఛాత్రోపాధ్యాయులు..

విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు ఫీల్డ్‌ ఇన్విజిలేటర్లుగా డైట్‌ ఛాత్రోపాధ్యాయులు వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 26, 28 తేదీల్లో 21 మందికి శిక్షణ కల్పించారు. వీరు ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులు చెప్పిన సమాధానాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలు ఏవిధంగా ఉన్నాయనేది తేలనుంది. ఉపాధ్యాయుల పనితీరు కూడా దీనిపైనే ఆధారపడనుంది. ఆ తర్వాత విద్యా శాఖ అవసరమైన చర్యలు చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement