బోథ్: నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. ఈ మేరకు అసెంబ్లీ హాలులో శనివారం కలిసి విన్నవించారు. మంత్రి అధ్యక్షతన ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బోథ్‌లో డిపో ఏర్పాటుతో పాటు గిరి గ్రామాలకు పూర్తిస్థాయి ఆర్టీసీ కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇచ్చోడ బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యేలా
చూడాలని కలెక్టర్‌కు వినతి
తాంసి: మండలంలోని కప్పర్ల నుంచి పొచ్చెర వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షాను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. అసెంబ్లీ హాలులో సమీక్షకు హాజరైన కలెక్టర్‌ను ఎమ్మెల్యే కలిసి విజ్ఞప్తి చేశారు. కప్పర్ల రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా పూర్తి చేసేలా చూడాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కప్పర్ల మాజీ ఎంపీటీసీ కౌడాల మహేందర్, నాయకులు వినోద్ రెడ్డి,ముఖేష్, శ్రీనివాస్, అరుణ్, సాయినాథ్ ఉన్నారు.


