మూడునెలల తర్వాత పోస్టుమార్టం
తాంసి: గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన విద్యార్థిని సాయినిఖిత మృతదేహనికి మూడు నెలల తర్వాత మంగళవారం తాంసిలో పోస్టుమార్టం నిర్వహించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన దేవునూరి లింగన్న కుమార్తె సాయినిఖిత (14) నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 17న మృతి చెందింది. మృతదేహనికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించే వరకూ తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థిని తండ్రి లింగన్న రెండు రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బందిపై మెండోరా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం తాంసిలోని శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోరా ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో వైద్యులు అంకిత్‌రావు, అరవింద్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల నిమిత్తం ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక రావడానికి దాదాపు నెలరోజులు పట్టవచ్చని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.


