పాతమంచిర్యాల: తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు కాళేశ్వరం వంటి మరో విపత్తుగానే పరిగణించాలని వామ పక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మార్స్క్ భవనంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించే క్రమంలో సంభవించే పరిణామాలు, విపత్తులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కినాకిని చంద్రఘోష్ ఏక సభ్య కమిషన్ పేర్కొన్న విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వామపక్షాల, ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్ణయించిందన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయకుండా సుందిళ్లకు తరలించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి బాబన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


