కై లాస్‌నగర్: జిల్లాలో కొత్త గ్రామపంచాయతీలు ఏ ర్పడి ఎనిమిదేళ్లవుతోంది. ఆయా జీపీల్లో ఇంకా చౌకధరల దుకాణాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రేషన్ లబ్ధిదారులు బియ్యం కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేక ఆదివాసీల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారుతున్నాయి. తమ గ్రామాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు ఏళ్లుగా విన్నవిస్తూనే ఉన్నారు.
కార్డుల సంఖ్య పెరిగినా ..
రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తోంది. జిల్లాలో కొత్తగా పెరిగిన 33,905 కార్డులతో కలిసి ఈ సంఖ్య 2,26,048కి చేరింది. అయితే కార్డుల సంఖ్యకు అనుగుణంగా చౌక ధరల దుకాణాలు ప్రజలకు అందుబాటులో లేవు. జిల్లాలో 356 రేషన్ షాపులు మాత్రమే ఉన్నాయి. ఈలెక్కన ఒక్కో షాపు పరిధిలో సగటున 631 కార్డులున్నాయి. అయితే 350 కార్డుల వరకే ఒక దుకాణం ఉండాలని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. అదనంగా కార్డులు ఉండటం ద్వారా బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. కార్డుదా రులు దేశంలో ఎక్కడైన బియ్యం తీసుకోవచ్చనే నిబంధన తమకు అదనపు భారంగా మారుతుందని చెబుతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా అవే తిప్పలు ..
గూడేలు, తండాలను రాష్ట్ర ప్రభుత్వం 2018లో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 227 జీపీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఎనిమిదేళ్లవుతున్నప్పటికీ ఇప్పటికి ఆయా గ్రామాల్లో రేషన్ షాపులను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ఈ గ్రామాలన్నీ గతంలో అనుబంధ గ్రామాలుగా ఉన్నవే కావడం, స్థానికంగా షాపులు ఏర్పాటు చేయకపోవడంతో కార్డుదారులు సమీపంలోని గ్రామాలకు ఆటోలు, ద్విచక్రవాహనాలపై వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ, గిరిజనులు కిలోమీటర్ల మేర కాలినడకనే వెళ్లి నెత్తిన బియ్యం మూటలతో తెచ్చుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వారు కోరుతున్నారు.
రాళ్లదారిలో బియ్యం మూటలు ఎత్తుకుని వెళ్తున్న ఆదిలాబాద్ రూరల్ మండలం మాంగ్లీ గ్రామస్తులు
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..
ఇటీవలే నేను రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఏయే గ్రామాల్లో రేషన్‌షాపులు లేవనే వివరాలను డీఎస్‌వో నుంచి తెలుసుకుంటాను. వారిచ్చే నివేదిక ఆధారంగా కొత్త షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ తదుపరి ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం.
– ఎస్.రాజేశ్వర్, రెవెన్యూ
ఇన్‌చార్జి అదనపు కలెక్టర్
‘రేషన్ షాపులు లేని గ్రామాల్లో వెంటనే కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా కార్డుదారులకు స్థానికంగానే బియ్యం అందించవచ్చు..’ ఇవి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 6న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో జిల్లా అధికారులకు చేసిన ఆదేశం.
జిల్లాలో..
రేషన్ కార్డులు : 2,26,048
రేషన్ దుకాణాలు :356
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో : 53
గ్రామీణ మండలాల పరిధిలో : 303


