శిక్షణ సరే.. మరి విధులేవి? | - | Sakshi
Sakshi News home page

శిక్షణ సరే.. మరి విధులేవి?

Mar 23 2026 8:23 AM | Updated on Mar 23 2026 8:23 AM

జిల్లాలో సర్వేయర్లుగా 110 మంది ఎంపిక లైసెన్స్‌లు అందజేసిన ప్రభుత్వం విధుల కేటాయింపు కోసం నిరీక్షిస్తున్న వైనం

కై లాస్‌నగర్‌: భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమాత పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. భూ సర్వే ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ రైతులకు సమస్యల్లేకుండా చూడాలనే ఉద్దేశంతో లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో రెండు విడతల్లో 110 మందిని ఎంపిక చేసి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా నియామకపత్రాలను అందజేశారు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ వారు చేయాల్సిన పనులపై విధి విధానాలు ఖరారు చేయకపోవడం, ఎలాంటి సర్వే పనులు అప్పగించకపోవడంతో వాటి కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. తమకు విధులు కేటాయించాలంటూ అధికారులను కలిసి వేడుకుంటున్నారు.

రెండు విడతల్లో ఎంపిక ..

వ్యవసాయ భూముల సర్వే చేయాల్సిన మండల సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలోని 21 మండలాలకు గానూ కేవలం పది మంది సర్వేయ ర్లు మాత్రమే ఉన్నారు. భూముల సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా వారి చేలవైపు చూసే పరిస్థితి లేదు. దీంతో రైతులు వారి చు ట్టూ కాళ్లరిగేలా తిరిగినా పనికాని పరిస్థితి ఉంది. ఇ లాంటి పరిస్థితిని దూరం చేసి భూ సర్వేలో పారదర్శకతను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొదటి బ్యాచ్‌కు మే 26 నుంచి జూలై 25 వరకు, రెండో బ్యాచ్‌కు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో రాత పరీక్షతో పాటు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు పరీక్షల్లో ప్రతిభ చాటిన వారిని సర్వేయర్లుగా ఎంపిక చేసి వారికి లైసెన్స్‌లు జారీ చేశారు. జిల్లాలో రెండు విడతలుగా 110 మందిని ఎంపిక చేసి వారికి హైదరాబాద్‌ శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. తొలి విడతలో 44 మందికి లైసెన్స్‌లను జారీ చేయగా మలి విడతలో 65 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో శిక్షణ పొందినప్పటికీ జిల్లా వాసి కావడంతో ఒకరిని మన జిల్లాకు కేటాయించారు.

నెలలు గడుస్తున్నా ..

తొలి విడతలో ఎంపికై న వారికి గతేడాది అక్టోబర్‌ 19న, రెండో విడతలో ఎంపికై న వారికి ఈ ఏడాది ఫిబ్రవరి 27న హైదరాబాద్‌ శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ వారు చేయాల్సిన పనులపై ఎలాంటి విధివిధానాలు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. వారికి ఎలాంటి సర్వే పనులు కూడా అప్పగించడం లేదు. అయితే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకతను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాపును ప్రభుత్వం తప్పనిసరి చేసినట్లుగా తెలి సింది. ఇందుకోసం లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ ద్వారా రై తులు తమ భూములను సర్వే చేయించి నిర్దిష్ట ఫీజు లను చెల్లించాల్సి ఉంటుంది. రెండెకరాల్లోపూ విస్తీర్ణాన్ని సర్వే చేసి మ్యాప్‌ అందించడానికి గానూ రై తులు రూ.1000 ఫీజుగా చెల్లించాలి. ఇందులో 5 శాతం ప్రభుత్వం మినహాయించుకుని 95 శాతం సర్వేయర్లకు చెల్లించాలని భావించినట్లుగా తెలిసింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించకపోవడం, విధులు కేటా యించకపోవడంతో లైసె న్స్‌ పొందిన సర్వేయర్లు తమకు విధులు కేటాయించాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు

అర్హులైన వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు శిక్షణనిచ్చాం. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లైసెన్స్‌లను జారీ చేశాం. తదుపరిగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటాం.

– ఎల్‌.ప్రభాకర్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement