కై లాస్‌నగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాలోని దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా నిధుల కేటాయింపులు చేయడం హర్షనీయమని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బాలురి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్లపాలనలో నిరాదరణకు గురైన సీఆర్‌ఆర్ కొరట–చెనక బ్యారేజీని పూర్తిచేసి 50వేల ఎకరాల ఆయకట్టుకు నిరందించడమే లక్ష్యంగా రూ.177.54 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిందన్నారు. ఇందులో రూ.90 కోట్లు భూసేకరణకు, రూ.87 కోట్లు అదనపు నిర్మాణాలకు కేటాయించారన్నారు. సాత్నాల ప్రాజెక్ట్‌కు రూ.కోటి, మత్తడి వాగు ప్రాజెక్ట్‌కు రూ.4.62 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రేషన్ కార్డు గల ప్రతీ పేద కుటుంబానికి రూ.5 లక్షల జీవితబీమా ప్రకటించి యావత్ దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఏటీసీలను అభివృద్ధి చేసి విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించాలనే ఉద్దేశంతో రూ.5వేల కోట్లు కేటాయించారన్నారు. పేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు రూ.5వేల కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు బండి దేవదాస్ చారి, గౌలి సంజయ్ కుమార్, నాయకులు సిరాజ్, రవి, పరమేశ్వర్, మొయిన్, ఇర్షద్, రాజ్ మొహమ్మద్, తదితరుల పాల్గొన్నారు.


