బలాబలాలు..
మున్సిపల్ పీఠమే లక్ష్యంగా..
స్వతంత్ర కౌన్సిలర్‌ను చైర్‌పర్సన్ చేసే యోచన
జతకట్టిన కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్!
ఆయా పార్టీల ముఖ్యనేతల మంత్రాంగం
పాలకవర్గం తమదేనంటున్న బీజేపీ
ఆసక్తికరంగా ‘పుర’ రాజకీయం
రేపటి ప్రత్యేక సమావేశంపై అందరి దృష్టి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పీఠం బీజేపీకి దక్కవద్దు.. ఏమైనా చేయండి ఇది కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు.. దీంతో రంగంలోకి దిగిన ‘హస్తం’ నేతలు ముందుగా స్వతంత్ర కౌన్సిలర్లతో చర్చలు జరిపా రు.ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ను సంప్రదించారు. 45వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై న, స్వతంత్ర అభ్యర్థిని బండారి అనూషను చైర్‌పర్సన్‌గా ఎన్నుకుందా మనే ప్రతిపాద న ఆయా పార్టీల మధ్య కొనసాగింది. దీనిపై అంగీకా రం కుదిరినట్లు ఆ ము ఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ టికెట్‌ను ఆశించి భంగపడ్డ బండారి సతీశ్ తన సతీమణి అనూషను మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా బరిలోకి దించారని, ఒక విధంగా వారు కాంగ్రెస్ పార్టీకే చెందిన వారంటూ, ఈ లెక్కన పీఠం కాంగ్రెస్‌కే దక్కినట్లుగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా రు. ఇక క్షేత్రస్థాయిలో శుక్రవారం రాత్రి నుంచి శని వారం ఉదయం వరకు కార్యాచరణ కొనసాగింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు వేర్వేరుగా క్యాంపులో ఉండగా,తాజాగా ఎంఐఎం నలు గురు స్వతంత్ర అభ్యర్థులను కూడా శిబి రానికి తరలించారు. బీజేపీకి పీఠం దక్కకుండా చేయగలుగుతున్నామనే ధీమా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత రాజకీయంగా ఆసక్తికరమైన పరిణమాలు చోటు చేసుకుంటున్నారు. 49 వార్డులు ఉన్న ఆదిలాబాద్‌లో అత్యధికంగా 21 వార్డులను కై వసం చేసుకున్న బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరమైనప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓట్లు, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో పాలకవర్గం ఏర్పాటు చేస్తామని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. బీజేపీ తర్వాత అత్యధిక వార్డులు సాధించిన కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్లను కలుపుకున్న మ్యాజిక్ ఫిగర్‌కు అందనంత దూరంలో ఉన్నప్పటికీ శుక్రవారం రాత్రి ‘హస్తం’ పార్టీ ముఖ్యనేతలు పీఠం తమ చేతి నుంచి చేజారలేదని, స్వతంత్ర అభ్యర్థులు తమ వద్ద ఉన్నారని చెప్పిన విషయం విదితమే. దీంతో స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతు లేకుండా బీజేపీ ఎలా పాలకవర్గం ఏర్పాటు చేస్తుంది.. ఇంకా ఏమైనా ఎక్స్ అఫీషియో ఓట్లు కలుపుకోవడం ద్వారా ముందుకు వెలుతుందా.. ఇలా రకరకాల చర్చలు సాగుతూ వచ్చాయి. ఎన్నికల కమిషన్ నుంచి ఓ నిర్ణయం వెలువడటం, ఎంపీ, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ఏదైనా మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోలుగా ఓటు వేయవచ్చని, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అదే జిల్లాలోని మున్సిపల్ పరిధిలో ఓటరై ఉండాలని, అలాంటప్పుడే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో మరో రెండు ఎమ్మెల్సీ ఓట్లు ఏమైనా బీజేపీకి కలిసి రావచ్చని అనుకున్నప్పటికీ అ అవకాశం లేకుండా పోయింది.
కూటమి ఏర్పాటు ..
బీజేపీ ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో ధీమాగా ముందుకు వెళ్తుండగా, మరో పక్క కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కూటమిగా ఏర్పడి స్వతంత్ర కౌన్సిలర్లతో చర్చించారు. బండారి అనూషను చైర్‌పర్సన్‌గా చేస్తామనే ప్రతిపాదనను స్వతంత్ర కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి వారు ఆమోదం తెలిపినప్పటికీ ఓ స్వతంత్ర కౌన్సిలర్ తనకు వైస్ చైర్మన్ పదవీ ఇవ్వాలని కోరినట్లుగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ విషయంలో కూటమి ఒప్పుకోకపోవడంతో ఆ స్వతంత్ర కౌన్సిలర్ ఎలాంటి నిర్ణయం చెప్పకుండా వెళ్లిపోయినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉండగానే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తనయుడు పాయల్ శరత్ స్వతంత్ర కౌన్సిలర్‌ను ఆయన ఇంట్లో కలిసి అతడితో పాటు ఆయన అనుచరగణంతో శనివారం చర్చలు చేశారు. ఆ స్వతంత్ర కౌన్సిలర్‌కు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని, పార్టీ కండువా కూడా కప్పుకోనవసరం లేదని ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒకే చెప్పారని ఇటువైపుగా ప్రచారం సాగుతుంది.
వైస్‌చైర్మన్ ఎవరికో..?
కూటమి పీఠం కై వసం చేసుకుంటే చైర్‌పర్సన్‌గా అనూషను వారు ప్రతిపాదిస్తుండగా, వైస్ చైర్మన్ విషయంలో ఇంకా తకరారు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బండారి సతీష్ తమ పార్టీకే చెందిన వారు కావడంతో ఇక చైర్‌పర్సన్ పదవీ కాంగ్రెస్‌కే దక్కినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వైస్ చైర్మన్ కోసం బీఆర్‌ఎస్, ఎంఐఎంలు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకుంటున్నారు. చైర్‌పర్సన్ ఎన్నికతో పాటు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
బీజేపీకి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకుని 23 బలం ఉండగా, ఒక వేళ ఓ స్వతంత్ర కౌన్సిలర్ మద్దతునిచ్చిన పక్షంలో 24కు చేరుకుంటుంది. ఇది మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 2 ఓట్ల దూరంలో నిలుస్తుంది. అయితే పీఠం ఎలాగైనా దక్కించుకుంటామని బీజేపీ స్పష్టం చేస్తోంది. మరో పక్క కాంగ్రెస్‌కు 11, బీఆర్‌ఎస్‌కు 6, ఎంఐఎంకు 6 కలుపుకుంటే 23కు చేరుకుంటుంది. ఇప్పటికే నలుగురు స్వతంత్ర అభ్యర్థులను కూడా శిబిరానికి తరలించామని చెబుతుండటంతో వారి సంఖ్య 27కు చేరుతుంది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఒకటి ఎక్కువే.
బలాబలాలు..


