ఎన్నోట్లు పడ్డయ్‌.. ఎక్కడ తగ్గినయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఎన్నోట్లు పడ్డయ్‌.. ఎక్కడ తగ్గినయ్‌!

Feb 15 2026 7:18 AM | Updated on Feb 15 2026 7:18 AM

ఎన్నో

ఎన్నోట్లు పడ్డయ్‌.. ఎక్కడ తగ్గినయ్‌!

● ఓటమిపై అభ్యర్థుల అంతర్మథనం ● లెక్కలేసుకుంటున్న పరాజితులు

కై లాస్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. విజేతలు సంబరాల్లో మునిగితేలుతుండగా ఓటమి చవిచూసిన వారు అంతర్మథనంలో పడ్డారు. పరాజయానికి కారణాలపై తమ అనుచరులతో విశ్లేషిస్తున్నారు. ఓట్లు ఎక్కడ తగ్గినయ్‌.. ఎక్కడ పడ్డయ్‌ అంటూ లెక్కలేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రచారం నిర్వహించి ఓటర్లను మచ్చిక చేసుకున్నప్పటికీ తమను ఆదరించకపోవడానికి కారణమేంటనే ఆలోచనలో పడ్డారు. మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా ప్రధాన పార్టీలేవీ మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోకలేదు. మరోవైపు ఓటమి పాలైన అభ్యర్థులు అసలు ఎలా ఓడాం..ఎక్కడ వెనుకబడ్డామనే దానిపై ఎవరికి వారు బేరీజు వేసుకుంటున్నారు.

ఏమాత్రం వెనకాడకున్నా..

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పార్టీలతో పాటు ఏఐఎఫ్‌బీ, బీఎస్పీ, డీఎస్పీ, జనసేన వంటి పార్టీలు, స్వతంత్రులు సైతం పెద్ద ఎత్తున పోటీ చేశారు. నామినేషన్‌కు ముందు నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గల్లీల్లో యువకులను ఆకర్షించేలా ప్రత్యేక తాయిలాలు అందజేశారు. అలాగే వారం పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తమను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. వారి అనుగ్రహం కోసం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. మందుతో పాటు డబ్బులు సైతం భారీగా పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతీ ఓటును కీలకంగా భావించిన అభ్యర్థులు పలు వార్డుల్లో ఓటుకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతో లక్షలు గుమ్మరించారు. పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్లు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనుసరించే పద్దతుల్లో రాజీ పడలేదు. కొన్ని వార్డుల్లో గెలుపును సవాలుగా తీసుకుని బరిలోకి దిగిన అభ్యర్థులు సుమారు రూ.40లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా చర్చ సాగుతోంది. ఇంత చేసినా పలువురు అభ్యర్థులు ఒడిపోవడంతో ఓటమికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

సంబరాల్లో విజేతలు ..

పరాజితులు నైరాశ్యంతో ఓటమికి గల కారణాలను విశ్లేస్తుండగా , గెలిచిన వారు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. కోడ్‌ కారణంగా అట్టహాసంగా ర్యాలీలు చేపట్టేందుకు అవకాశం లేదు. దీంతో ఆయా కాలనీల్లో కాలినడకన తిరుగుతూ ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నారు. మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వచ్చిన ఓట్లెన్ని...

వార్డులోని మొత్తం ఓటర్లను పరిగణలోకి తీసుకుని బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు సాగారు. మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమాతో ప్రచారాన్ని హోరెత్తించారు. తీరా ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలైన ఓట్లపై లెక్కలు వేస్తున్నారు. ప్రత్యర్థికి వచ్చిన ఓట్లు, తమకు వచ్చినవి పరిశీలిస్తూ విజయానికి అవసరమైన ఓట్లను పొందడంలో ఎక్కడా విఫలమయ్యామని క్యాడర్‌, సన్నిహితులతో చర్చిస్తున్నారు.ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశాం.. ప్రతీ ఓటరును కలిసి మద్దుతు కోరాం.. వారడిగినంత ముట్టజెప్పాం.. కోరిన హామీలన్నీ నెరవేరుస్తామని కూడా చెప్పినమ్‌.. అయినా ఎందుకు ఓడిపోయామంటూ వీధుల వారీగా ఉన్న ఓట్ల లెక్కలు తీస్తున్నారు. ఏ వీధిలో పడలేదు.. అనుకూలంగా ఎవరు ఓట్లు వేశారు.. వ్యతిరేకంగా ఎవరు పనిచేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఇదే చర్చ సాగుతోంది.

ఎన్నోట్లు పడ్డయ్‌.. ఎక్కడ తగ్గినయ్‌!1
1/1

ఎన్నోట్లు పడ్డయ్‌.. ఎక్కడ తగ్గినయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement