రైతులను ముంచేసిన చంద్రబాబు సర్కార్
ఫ ఉచిత పంటల బీమానుఎత్తివేయడం దారుణం
ఫ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి మోసం
ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు బాబీ
ఫ సమావేశంలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి, సూర్యప్రకాశ్
అమలాపురం టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేశారని, ఈ చంద్రబాబు ప్రభుత్వం ఆ బీమాను ఎత్తివేసి రైతులను మోసం చేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ధ్వజమెత్తారు. అమలాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి ఆయన మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనేక హామీలు ఇచ్చారని, జగన్ ఇస్తున్న ఉచిత పంటల బీమాతో పాటు రైతులకు అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానాలు చేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రూ.7,800 కోట్ల మేర రైతులకు ఉచిత పంటల బీమా ద్వారా వెచ్చించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడమే కాకుండా కనీసం దాని గురించి రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమైందన్నారు. జగన్ పాలనలో 54 లక్షల మంది రైతులకు బీమా ప్రీమియం చెల్లించారని, అదే కూటమి ప్రభుత్వం బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న 18 లక్షల మంది రైతులకు మాత్రమే ప్రీమియం చెల్లించిందన్నారు. వ్యవసాయంలో 80 శాతం ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇప్పటికే రూ.1100 కోట్ల మేర రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ బాకీ పడిన విషయాన్ని గుర్తు చేశారు.
చంద్రబాబుపై అపనమ్మకం
జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమాను ఎత్తివేయడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. రైతుల పంటలకు బీమా కల్పించేందుకు ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏ ఒక్క బీమా సంస్థ ముందుకు రాలేదంటే చంద్రబాబు పాలనపై వారికున్న అపనమ్మకమే కారణమని స్పష్టం చేశారు. సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాశ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


