దర్శకుడు ఈవీవీ తండ్రి వెంకట్రావు మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామానికి చెందిన సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు (90) ఆయన స్వగృహంలో మంగళవారం కన్నుమూశారు. విషయం తెలియగానే ఈవీవీ కుమారులు, సినీ నటులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ స్వగ్రామానికి చేరుకుని తాతయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో కోరుమామిడిలో అంత్యక్రియలు నిర్వహించారు. వెంకట్రావుకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్ అనే ముగ్గురు కుమారులు, ముళ్లపూడి మంగాయమ్మ అనే కుమార్తె ఉన్నారు.
స్టోరేజ్ టెర్మినల్‌లో మంటలు
కాకినాడ రూరల్: కాకినాడ పోర్టు రోడ్డులోని మహతి స్టోరేజ్ టెర్మినల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం బ్రాయిలర్ పైపు నుంచి వచ్చిన మంటలు కలకలం రేపాయి. బ్రాయిలర్ వేడికి పైపు నుంచి మంటలు రావడంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్న కోరమాండల్, కాకినాడ శాలిపేటలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే కోరమాండల్‌కు చెందిన రెండు, శాలిపేట నుంచి అగ్నిమాపక కేంద్రం వాహనం ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మంటలు తక్కువ స్థాయిలో ఉండడంతో వాటిని అదుపు చేశాయి. సమీపంలో స్టోరేజ్ ట్యాంక్‌లలో కెమికల్స్‌తో పాటు సమీపంలో కోరమాండల్ ఎరువుల కర్మాగారం, సీపోర్టు ఉండడంతో మంటలతో భయందోళనలు వ్యక్తమయ్యాయి. ఎటువంటి ప్రమాదం జరగలేదని, కేవలం బ్రాయిలర్ పైపు హీట్ వలన మంటలు రావడంతో అదుపు చేశామని శాలిపేట అగ్నిమాపక అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 వేల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు.
చలిమంటలో పడి
వ్యక్తికి గాయాలు
రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు గ్రామమైన జి.శరభవరంలో బోడోజు మంగారావు (65) సోమవారం అర్ధరాత్రి చలి మంటలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అలాగే మంటలు పైకి ఎగసి పడటంతో అతడు నివశించే పూరిపాక కూడా కాలిపోయింది. సర్పంచ్ ఆదిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంగారావు తన భార్య ముసలమ్మతో పాటు పూరింట్లో జీవిస్తున్నాడు. చలి ఎక్కువగా ఉండటంతో దంపతులు ఇంటి లోపలే మంట వేసుకున్నారు. అయితే భార్య బయటకు వెళ్లిన సమయంలో మంగారావు చలి మంటలో పడిపోయాడు. అతడు వేసుకున్న చొక్కాకు మంట అంటుకోవడంతో వీపు భాగం కాలిపోయింది. ఇరుగుపొరుగువారు అతడిని వెంటనే 108లో జడ్డంగి పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కాకినాడ జీజీహెచ్‌కు వైద్యులు రిఫర్ చేశారు. డాక్టర్ పావని, స్టాఫ్ నర్స్ నాగలక్ష్మి, 108 స్టాఫ్ మరిణిరాజు, చిట్టిబాబు చికిత్స అందజేశారు.
దర్శకుడు ఈవీవీ తండ్రి వెంకట్రావు మృతి
దర్శకుడు ఈవీవీ తండ్రి వెంకట్రావు మృతి


