అయినవిల్లి ఆలయంలో చదువుల పండగ
ఫ రేపటి నుంచి 24 వరకూ నిర్వహణ
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఫ 25న విద్యార్థులకు పెన్నుల పంపిణీ
అయినవిల్లి: చదువుల పండగ పేరుతో అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి ఈనెల 24 వరకూ మహాక్రతువులు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చదువుల పండగకు ఆలయంలో అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. గణపతి కల్ప ప్రారంభంతో, సప్తనదీ జలాభిషేకంతో, సహిత లక్ష కలముల వితరణ మహోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. తొలిరోజు 22న జరిగే సప్తనదీ జలాభిషేకం కోసం గోదావరి, గంగ, యమున, సరస్వతి, సింధు, కావేరి, నర్మద నదుల నుంచి ఆలయ అధికారులు జలాలు సేకరించారన్నారు. జలాభిషేకం అనంతరం స్వామివారి పాదాల వద్ద లక్ష కలాలతో పూజలు చేసేందుకు వేద పండితుల సర్వం సిద్ధం చేశారని, 22న సరస్వతీ కల్పం, 24న మహా పూర్ణాహుతి ఉంటాయన్నారు. శ్రీపంచమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో విద్యార్థులతో సరస్వతీ పూజ చేయిస్తామన్నారు. స్వామివారి పాదాల చెంత ఉంచిన పెన్నులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా ఈ నెల 25న విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు మాట్లాడుతూ స్వామివారి కలాల కోసం విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారన్నారు.


