● మిగిలిన ఆరు మండలాల్లో రేపే ఎన్నికలు ● బీఆర్‌ఎస్ ఇలాఖ
జీపీలు
సాక్షి,ఆదిలాబాద్: పంచాయతీ సంగ్రామం చివరి దశకు వచ్చింది. మూడో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. బీఆర్‌ఎస్ అధికార పార్టీకి పోటీనిచ్చింది. బీ జేపీ ప్రభావం చాటుకుంది. చివరి విడత ఎన్నికలు బోథ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొనసాగనున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడగా, బీజేపీ స్వల్ప స్థానాలతో ప్రభావం చాటుకుంది. గులాబీ ఇలాఖాలో జరుగుతున్న చివరి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుందా.. బీఆర్‌ఎస్ ఇక్కడ అధిక స్థానాల్లో గెలుపొంది జిల్లాలో ఆధిపత్యం కొనసాగిస్తుందా.. ఈ రెండు పార్టీలకు బీజేపీ ఏమైనా చెక్ పెడుతుందా.. అనేది రేపటి ఫలితాలతో స్పష్టం కానుంది.
స్వతంత్రులపై ఫోకస్..
రెండు విడతల్లో రాజకీయ పార్టీ మద్దతుదారులతో పాటు స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలో గెలు పొందారు. గెలిచిన వారిలో 60కి పైగా స్వతంత్ర సర్పంచులు ఉండగా, వారు ఇప్పుడు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అధి క శాతం ఇండిపెండెంట్లు అధికార కాంగ్రెస్ వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మరోవైపు ఆదిలాబాద్ నియోజకవర్గంలో స్వతంత్రులను బీజేపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ ముఖ్య నాయకులు దృష్టి సారించారు.
ప్రతిష్టాత్మకంగా..
మూడో విడత ఎన్నికలను కొంత మంది నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ ఇద్దరిదీ నేరడిగొండ మండలం. దీంతో ఈ మండలంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించేందుకు ఇరువురు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అనిల్ జాదవ్ స్వగ్రామం రాజురాలో సర్పంచ్ ఏకగ్రీవం కాగా, గజేందర్ స్వగ్రామం బొందిడిలో ద్విముఖ పోటీ నెలకొంది. బజార్‌హత్నూర్ మండలంలో కాంగ్రెస్‌కు అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించేందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత మండలంలో ఆయన ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధికార పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ సోయం బాపూరావు తన సొంత మండలమైన బోథ్‌తో పాటు ఈ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తలమడుగులో కాంగ్రెస్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ గోక గణేశ్‌రెడ్డి అత్యధిక సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మండలంలో గట్టి ప్రభావం చూపడం ద్వారా అధికార పార్టీలో తన సత్తా చాటుకునేలా ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ గోడం నగేశ్ తన సొంత మండలం బజార్‌హత్నూర్‌తో పాటు బోథ్ నియోజకవర్గంలో పార్టీ పరంగా మద్దతుదారులు అత్యధికంగా గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడిహత్నూర్ మండలంకు చెందిన కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ తన సొంత మండలంతో పాటు నియోజకవర్గంలో పార్టీ మద్దదారుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాల్సిందే. మొత్తంగా చివరి విడత ఎన్నికలు పార్టీలపరంగా ఆసక్తికరంగా మారాయి.
జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఇలా..
విడత మొత్తం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ స్వతంత్రులు
మొదటి 166 61 59 10 36
రెండో 156 56 30 45 25
మొత్తం 322 117 89 55 61
● మిగిలిన ఆరు మండలాల్లో రేపే ఎన్నికలు ● బీఆర్‌ఎస్ ఇలాఖ


