అక్రమ రిజిస్ట్రేషన్ల నియంత్రణకు చర్యలు
కై లాస్‌నగర్: ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్ల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ జనరల్ జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సోమవారం ఆయ న సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అధికారుల పనితీరు, రిజిస్ట్రేషన్ల వివరాలపై ఆరా తీశారు. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ రిజిస్ట్రేషన్లను నియంత్రించేలా నిషేధిత భూముల జాబితా లను రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు రోజుల క్రితం అందజేసినట్లుగా తెలిపారు. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డ్, దేవాదాయ శాఖల నిషేధిత భూముల వివరాలన్నీ అందులో ఉన్నట్లుగా వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్ అమల్లోకి వచ్చాక అక్రమ రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ప్రజలు కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు కావద్దని సూచించారు. రిజిస్ట్రేషన్లలో జాప్యం కాకుండా స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చినట్లుగా తెలిపారు. అనధికార లేఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే సబ్‌రిజిస్ట్రార్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు బాధ్యుడైన ఆదిలాబాద్ సబ్‌రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్‌పై వేటు వేసినట్లు స్పష్టం చేశారు. అలాగే రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల నియామకం, కార్యాలయాల నూతన భవన నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా వివరించారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ జి.ప్రసన్న, సబ్‌రిజిస్ట్రార్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇందులో సబ్‌రిజిస్ట్రార్లు, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.


