వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యం
కైలాస్‌నగర్: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం గూగుల్ మీట్ ద్వారా తుది విడత ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో వంద శాతం పోలింగ్ సాధించేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. వార్డువారీగా ఎలక్ట్రో రల్ జాబితాను బీఎల్‌ఓల వద్ద ఉంచాలని, సహాయక కేంద్రాల ద్వారా ఓటర్లకు పోలింగ్ కేంద్రం, వార్డు, సీరియల్ నంబర్ వివరాలు అందించాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రతీ పోలింగ్ కేంద్రంలో వీల్‌చైర్లు, ఆటో సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. సమస్యాత్మక పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ సామగ్రిని రిటర్నింగ్, ప్రెసిడింగ్ అధికారులు పూర్తిగా పరిశీలించుకుని కేంద్రాలకు వెళ్లాలన్నారు. పోలింగ్ నమోదు వివరాలను నిర్ణీత సమయంలో టి–పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. సిబ్బందికి భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. ఇందులో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, డీపీవో రమేశ్, ఆర్డీవో స్రవంతి, డీఎల్పీవో ఫణిందర్, మాస్టర్ ట్రైనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్, సెక్టర్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


