చాపకింద నీరులా కుష్ఠు
జిల్లాలో పెరుగుతున్న కేసులు అవగాహన లేమితోనే దుస్థితి ఈనెల 18 నుంచి 31వరకు గుర్తింపు సర్వే
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. వ్యాధి నిర్మూలనకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 2027 వరకు కుష్ఠు రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవగాహన లేమితోనే జనం వ్యాధి బారిన పడుతున్నారు. స్వచ్ఛందంగా పరీక్షలు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. నిర్ధారణ పరీక్షలు చేసినప్పుడు మాత్రమే కేసులు బయట పడుతున్నా యి. మార్చిలో నిర్వహించిన సర్వేలో కొత్తగా 45 మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 56 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంటున్నారు. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సరైన సమయంలో చికిత్స పొందితే నయం అవుతుందని పేర్కొంటున్నారు.
18 నుంచి సర్వే..
జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు 14 రోజుల పాటు కుష్ఠు గుర్తింపు ఉద్యమ కార్యక్రమం నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 6.30 నుంచి 9 గంటల వరకు ఆశ కార్యకర్తలు ఈ సర్వే చేపడుతారు. ఇంటింటికి తిరుగుతూ కుటుంబీకుల వివరాలు సేకరిస్తారు. శరీరంపై ఉన్న మచ్చలను గుర్తించి సమీపంలోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసేలా చూస్తారు. పట్టణంలో రోజుకు 25, గ్రామీణ ప్రాంతాల్లో 20 ఇళ్లను సర్వే చేపడతారు. పర్యవేక్షణ కోసం 200 మంది సూపర్‌వైజర్లను నియమించారు. వైద్యాధికారులు, సిబ్బందికి సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
తగ్గుముఖం పట్టని వైనం..
ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రీయ అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతోంది. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలుంటే పాసిబ్యాసెల్లరింగ్ అని పేర్కొంటారు. దీని నివారణకు ఆరు నెలల వరకు చికిత్స అందిస్తారు. ఆరు కంటే ఎక్కువ మచ్చలుండి, నరాలు ఉబ్బితే మల్టీ బ్యాసిలరిగా నిర్ధారిస్తారు. దీని నివారణకు ఏడాఇ వరకు చికిత్స అందిస్తారు. తొలి దశలో వ్యాధిని నిర్ధారించుకొని చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధిగా నిర్ధారిస్తారు. మార్చిలో చేపట్టిన సర్వేలో 45 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. జిల్లాలో 10వేల మందిలో ఒకరికి వ్యాధి సోకితే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం బజార్‌హత్నూర్, సొనాల, తాంసి, గిమ్మ, జైనథ్, పీహెచ్‌సీల పరిధిలో ఒక శాతం కంటే ఎక్కువగా కేసులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
సర్వే పకడ్బందీగా చేపడతాం..
కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను పకడ్బందీగా చేపడతాం. ఈనెల 18 నుంచి 31 వరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 56 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. 2027 నాటికి వ్యాధిని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో
సంవత్సరం కేసులు
2022–23 71
2023–24 83
2024–25 73
2025–26 45 (మార్చి నుంచి
ఇప్పటివరకు)


