‘రూని’కి ఘన నివాళి
ఆదిలాబాద్‌టౌన్: రూని సేవలు పోలీసు వ్యవస్థకు గర్వకారణమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. దశాబ్దానికి పైగా పోలీసు సేవల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన జాగిలం రూని బుధవారం ఉదయం మృతి చెందింది. 2012 బ్యాచ్‌కు చెందిన రూని హత్యకేసులు, దొంగతనాలు వంటి 250కు పైగా కేసుల్లో కీలక పాత్ర పోషించి 20 మంది నేరస్తులను పట్టించడంలో సహకరించినట్లు తెలిపారు. పోలీసు శాఖ తరఫున అంత్యక్రియలు నిర్వహించగా, పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ 2011లో జన్మించిన రూని 2012లో విధులు ప్రారంభించి 2021లో విరమణ చేసిందని తెలిపారు. నాలుగేళ్ల విశ్రాంతి అనంతరం మృతి చెందినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియల్లో డాగ్ స్క్వాడ్ సిబ్బంది, హ్యాండ్లర్ గంగన్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


