‘అభివృద్ధిని జీర్ణించుకోలేకే అసత్య ఆరోపణలు’
ఆదిలాబాద్: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని జీర్ణించుకోలేకనే మాజీ మంత్రి జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రగతి గురించి సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరవ్వడం వంటివి జరిగితే ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరి కాదన్నారు. గతంలో యూనివర్సిటీ, టెక్స్‌టైల్ పార్కు ఇతర జిల్లాలకు తరలిపోతుంటే అధికారంలో ఉండి కూడా ఏమి చేయలేకపోయారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు రఘుపతి, రవి, దినేష్ మటోలియా, జ్యోతి, రాకేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


