రసకందాయం
రెండో విడత పంచాయతీ సంగ్రామం మొదటి విడత ఫలితాల తర్వాత.. ఎమ్మెల్యేల క్షేత్రాల్లో ప్రత్యర్థి మద్దతుదారుల గెలుపు నేపథ్యంలో మలివిడత ఎన్నికలు బీజేపీ, బీఆర్‌ఎస్ నియోజకవర్గాల్లో.. ఆసక్తికరంగా మారిన పోరు
సాక్షి,ఆదిలాబాద్:మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత మలి రెండు విడతల సంగ్రామం రసకందాయంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో ఆ శాసన సభ్యులు తమ పట్టు నిలుపుకునేందుకు మద్దతు దారులను గెలిపించుకునేందుకు శాయశక్తులు ఒడ్డోడుతుండగా, తొలి ఫలితాలు వారికి కొంత కంటగింపుగా మారాయి. మొదటి విడతలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, ఈనెల 14న రెండో విడతలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉన్నచోట ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఆరు మండలాల్లోని 166 గ్రామపంచాయతీల్లో జరిగాయి. ఈ ఫలితాలు రెండో విడత ఎన్నికలను రసకందాయంలో పడేశాయి. ఈనెల 14న జరగనున్న మలి పోరులో 156 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 17 ఏకగ్రీవం అయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాలు, బోథ్ నియోజకవర్గంలోని 2 మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ పరిస్థితి..
మొదటి విడత ఎన్నికలు జరిగిన మండలాల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన అనిల్ జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇచ్చోడ, సిరికొండ మండలాల్లో జరిగిన మొదటి విడత ఎన్నికల్లో ఇచ్చోడలో బీఆర్‌ఎస్ అధిక స్థానాలు సాధించింది. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలను దక్కించుకున్నాయి. సిరికొండలో కాంగ్రెస్ దూకుడు చూపగా, ఏ పార్టీకి మద్దతు ఇవ్వని మరికొంత మంది గెలుపొందారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మొదటి విడతలో ఈ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఉట్నూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధిక స్థానాలు సాధించారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ మద్దతుదారులు కూడా గెలుపొందారు. ఏ పార్టీకి సంబంధం లేనివారు కూడా గెలుపొందారు. ఆసిఫాబాద్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గంలోని నార్నూర్, గాదిగూడలో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. నార్నూర్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారుల ప్రభంజనం కనిపించినప్పటికీ, గాదిగూడలో బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా గెలుపొందారు.
రెండో విడత ఎన్నికల వివరాలు..
మండలాలు: ఆదిలాబాద్‌రూరల్, మావల,
బేల, జైనథ్, సాత్నాల,
భోరజ్ తాంసి, భీంపూర్
జీపీల సంఖ్య: 156
ఏకగ్రీవం : 17
వార్డుల సంఖ్య : 1116
ఏకగ్రీవం: 1104
పోటీ నెలకొన్నవి: 139 (జీపీలు),
12 (వార్డులు)


