ఆకాంక్షకు అక్షరం తోడైంది.. | - | Sakshi
Sakshi News home page

ఆకాంక్షకు అక్షరం తోడైంది..

Dec 5 2025 2:04 PM | Updated on Dec 5 2025 2:04 PM

ఆకాంక్షకు అక్షరం తోడైంది..

ఆకాంక్షకు అక్షరం తోడైంది..

● ఎయిర్‌పోర్టు వచ్చేస్తోంది ● యూనివర్సిటీ చేరువవుతోంది ● ‘సాక్షి’ డిబేట్లపై సర్వత్రా హర్షం ● ప్రజా గొంతుకకు అభినందనల వెల్లువ

ఆకాంక్షకు అక్షరం తోడైంది.. అడవి బిడ్డల దశాబ్దాల కలలు సాకారమవుతున్నాయ్‌.. ఆశలకు రెక్కలతోపాటు ఇక పెద్ద చదువులూ దగ్గరకానున్నాయ్‌.. ఎర్రబస్సు కాదండోయ్‌.. ఇక ఎయిర్‌బస్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయ్‌.. ఉన్నత విద్య చేరువయ్యేలా వర్సిటీ కూడా మన చెంతకే వచ్చేస్తోంది. ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘సాక్షి’ ఈ ఏడాది చర్చా వేదికలకు శ్రీకారం చుట్టింది. ప్రజల గొంతుకగా నిలి చి ‘రెక్కలొచ్చేనా..’ అంటూ ఎయిర్‌పోర్టు ఆవశ్యకతపై గళమెత్తింది.. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నత విద్య అందుబాటులోకి రావాలన్నా, ఉద్యోగావకాశాలు మెరుగుపడాలన్నా విశ్వవిద్యాలయ ఏర్పాటు తథ్యమని భావించి ‘వర్సిటీ.. కావాల్సిందే’ అంటూ నినదించింది. ‘సాక్షి’ వరుస కథనాలు పాలకులను ఆలోచింపజేశాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు. ఆదిలాబాద్‌ గడ్డపై సీఎం గురువారం ఎయిర్‌పోర్టుపై కీలక ప్రకటన చేశారు. అంతేకాదు వర్సిటీ మంజూరు బాధ్యత తమదే అని అన్నారు. ఇంద్రవెల్లి అమరుల కేంద్రం అనుకూలంగా ఉంటుందని సూచించారు.. సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ చొరవ సర్వత్రా చర్చనీయాంశమైంది.. ప్రజా గొంతుకపై అభినందనలు వెల్లువెత్తాయి.

– ఆదిలాబాద్‌టౌన్‌/కై లాస్‌నగర్‌/ఆదిలాబాద్‌

సీఎంకు ధన్యవాదాలు

దశాబ్దాలుగా ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్న విశ్వవిద్యాలయ ఏర్పాటుపై సీఎం ప్రకటన చేసినందుకు యూనివర్సిటీ సాధన సమితి తరఫున ధన్యవాదాలు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేయడం, అలాగే కుమురంభీం పేరును ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. – తొగరి భాస్కర్‌,

యూనివర్సిటీ సాధన సమితి కోకన్వీనర్‌

దశాబ్దాల కల నెరవేరనుంది

అడవుల జిల్లాలో త్వరలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించడం హర్షణీయం. వర్సిటీ ఏర్పాటు ఆవశ్యకతపై ‘సాక్షి’ 2025 జూలై 9న చర్చావేదిక నిర్వహించింది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. జిల్లావాసుల దశాబ్దాల కల సాకారంలో పాలు పంచుకున్నందుకు ‘సాక్షి’ మీడియాకు ధన్యవాదాలు.

– రమణాగౌడ్‌, కోకన్వీనర్‌

వర్సిటీ ప్రకటన హర్షణీయం

సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ వేదికగా ఈ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. విశ్వవిద్యాలయం అందుబాటులో లేకపోవడంతో స్థానిక యువత దశాబ్దాలుగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం ప్రకటన జిల్లా వాసులకు ఆనందం కలిగించింది. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రారంభించిన యూనివర్సిటీ ఏర్పాటు ఉద్యమానికి ముఖ్యమంత్రి మద్దతు పలకడం హర్షణీయం. – బద్దం పురుషోత్తంరెడ్డి, యూనివర్సిటీ సాధన సమితి జిల్లా కన్వీనర్‌

సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నాం..

జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు సంవత్సరం వరకు ప్రారంభిస్తామని సీఎం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ ప్రాంతం వాణిజ్య పరంగానూ అభివృద్ధి చెందుతుంది. అలాగే యూనివర్సిటీ ఏర్పడితే జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

– ముడుపు ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి

ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి

జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు నిర్మాణమైతే దూరభారం తగ్గుతుంది. ఈ ప్రాంతం వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే యూనివర్సిటీ ఏర్పాటుతో పేద విద్యార్థులకు మేలు చేకూరుతుంది. ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ సాధన కోసం ‘సాక్షి’ కృషి అభినందనీయం.

– చిల్క సతీశ్‌, టీఆర్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

త్వరగా అందుబాటులోకి తేవాలి

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సభలో హామీ ఇచ్చారు. వీటిపై ఈ ప్రాంతవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. హామీలకే పరిమితం కాకుండా త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజాసమస్యలపై జనం గొంతుకగా ‘సాక్షి’ కృషి అభినందనీయం.

– రంగినేని మనిషా,

మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌

‘సాక్షి’ చొరవ అభినందనీయం..

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం అనేది జిల్లావాసుల చిరకాల కోరిక. ఈ క్రమంలో ‘సాక్షి’ ఇటీవల అన్నివర్గాలతో చర్చావేదిక నిర్వహించింది. సాధన కమిటీని సైతం ఏర్పాటైంది. రా జకీయ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ప్రజాపాలన విజయోత్సవ సభలో సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ఎయిర్‌పోర్టు పనులు ఏడాదిలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీ డియా పాత్ర ఎంతో కీలకమనేది స్పష్టమైంది.

– విజయ్‌బాబు సల్ల, రిటైర్డ్‌ లెక్చరర్‌

వర్సిటీ ఏళ్ల నాటి కల..

యూనివర్సిటీ అనేది ఈ ప్రాంత ప్రజల ఏళ్ల నాటి కల. ముఖ్యమంత్రి ప్రకటనతో అది సాకారమవుతుందనే నమ్మకం కలిగింది. గతంలో మంజూరైన యూనివర్సిటీ చేజారిపోయినట్లు కాకుండా జిల్లాలోని రాజకీయ నాయకులు పార్టీలకతీతంగా ప్రయత్నించాలి. యునివర్సిటీ సాధన విషయంలో ‘సాక్షి’ కృషి అభినందనీయం.

– ఉదారి నారాయణ, కవి, రచయిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement