ఘంటసాలకు ఘన నివాళులు
చీమకుర్తి: సినీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా గురువారం చీమకుర్తిలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అభయ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు మద్దాళి మాధవరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ముందురోజు నిర్వహించిన పాటల పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు.
ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వేస్టేషన్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు రైల్వేస్టేషన్లో స్పెషల్ పార్టీ పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఈగిల్ టీం సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కరూర్ ఈ రోడ్‌కు చెందిన పి.రమేష్ నుంచి 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం జీఆర్‌పీ పోలీసులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, పోలీసు వాట్సప్ నంబర్ 9121102266కు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో ఎస్సై శివరామయ్య, సుదర్శన్, చెంచయ్య, ఏఎస్సై మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: పశుసంవర్థక శాఖ ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌లో ఎన్‌సీడీసీ రుణాల అక్రమాలపై శుక్రవారం ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్‌లో విచారణ చేపట్టనున్నారు. విచారణాధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తన చాంబర్‌లో ఉదయం 11 గంటలకు విచారణ చేపట్టనున్నారు. గతంలో ఏడీ ఎం.రవికుమార్ అక్రమాలకు పాల్పడ్డారంటూ కొందరు సమాఖ్యలోని సంఘాల చైర్మన్లు, సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇంటిగ్రేటెడ్ షిప్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్, ఇతరులు రుణాల పంపిణీ సమయంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టనున్నారు. ఒంగోలులో గతంలో పనిచేసిన ముగ్గురు జాయింట్ డైరెక్టర్లను కూడా విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ సమాచారం పంపించారు.
చీమకుర్తి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో దేవస్థానాల భూములను ఎండోమెంట్ అధికారులు పరిశీలించారు. గురువారం మండలంలోని గోనుగుంట గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ భూములు, అలాగే చీమకుర్తిలో వేణుగోపాలస్వామి, చండ్రపాడు గ్రామంలో రుద్రేశ్వర స్వామి ఆలయ భూములను పరిశీలించారు. ఆలయ భూములను దేవస్థానాల పేరిట నమోదు చేయాలన్న అర్జీ విషయంలో ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. తహసీల్దారు బ్రహ్మయ్య, ఎండోమెంట్ ఆఫీసర్లు రజినీ కుమారి, లక్ష్మీ ప్రసన్న, మండల సర్వేయర్ మోజెస్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
కొత్తపట్నం: జాతీయ స్థాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ప్రణవి సిల్వర్ మెడల్ సాధించింది. నవంబర్ 24 నుంచి ఈ నెల 3వరకు రాజస్థాన్‌లో జైపూర్‌లో యూనిర్సిటీ స్థాయి పోటీలు జరిగాయి. ఈపోటీల్లో మండలంలోని రంగాయపాలెం పంచాయతీ, వలసపాలేనికి చెందిన ప్రణవి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఈమె తండ్రి ద్వారం జాలిరెడ్డి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. రాబోయే రోజుల్లో ప్రణవి అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పతకాలు సాధించాలని రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు, డి.వెంకటేశ్వరరెడ్డి అభినందనలు తెలిపారు.
ఒంగోలు టౌన్: కనిగిరి పోలీసు స్టేషన్‌లో సీపీఎం కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం అక్రమమని ఆపార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కనిగిరి మండలం మాచవరం గ్రామానికి చెందిన ఒక మహిళకు సంబంధించిన సమస్య విషయంలో తగిన న్యాయం చేయాలని పోలీసుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు.
ఘంటసాలకు ఘన నివాళులు
ఘంటసాలకు ఘన నివాళులు


