విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఒంగోలు సిటీ: మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని, జిల్లా యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలకు నిధులు కేటాయించి భవన నిర్మాణాలు ప్రారంభించాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సీహెచ్ వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏపీ జేఏసీల ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను మూయించి నెల్లూరు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని, పది రకాల డిమాండ్లతో బంద్ నిర్వహించామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై సైకిల్ యాత్రలు, ధర్నాలు, చలో విజయవాడ వంటి పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రితో చర్చలు నిర్వహించినా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. మార్కాపురంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి పాల్గొని ర్యాలీ నిర్వహించి బంద్‌ను జయప్రదం చేశారని తెలిపారు. దర్శిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ పాల్గొని విద్యార్థులతో సభ నిర్వహించి అనంతరం ర్యాలీ చేశారు. కనిగిరిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారావు పాల్గొని బంద్ నిర్వహించారు. గిద్దలూరులో జిల్లా అధ్యక్షుడు ఆరోను, నాయకులు తేజ, అమర్నాథ్ పాల్గొని బంద్ విజయవంతం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌కు ఇచ్చారు. చీమకుర్తిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి దేవరాజు పాల్గొని బంద్ చేశారు. సింగరాయకొండలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు దేవా పాల్గొని బంద్ నిర్వహించారు. సంతనూతలపాడు మండలం మంగమూరులో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నవీన్ పాల్గొని బంద్ నిర్వహించారు. కొండపిలో విద్యార్థులు బంద్ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు కేజీ మస్తాన్ మద్దతు తెలిపారు.


