● ప్రాణభయంతో చెట్టెక్కిన పశువుల కాపరి
కోడైపె పులి దాడి
వేమనపల్లి: మండలంలోని చామనపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన పశువుల కాపరి జంపం పవన్ గురువారం సాయంత్రం పశువుల మందను తోలుకుని ఇంటికి వస్తుండగా పెద్దవాగు సమీపంలో పులి దాడి చేసింది. భయాందోళన చెందిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలి, టిఫిన్‌బాక్స్ పక్కన పడేసి పక్కనే ఉన్న మద్దిచెట్టు ఎక్కాడు. పులి కదలికలను ఫోన్‌లో బందించాడు. చూస్తుండగానే దుర్గం బానయ్యకు చెందిన కోడైపె దాడి చేయడంతో అది తప్పించుకుంది. చెట్టు మీదనే ఉన్న పవన్ ఇంటికి ఫోన్ చేయడంతో గ్రామస్తులు డప్పులతో శబ్ధం చేస్తూ బయలుదేరారు. శబ్ధానికి పులి అక్కడి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న బద్దంపల్లి, చామనపల్లి అటవీ సెక్షన్, బీట్ అధికారులు స్వామి, స్వరూప, రాజ్‌కుమార్, హేమంత్ ఘటనా స్థలానికి వెళ్లి పులి పాదముద్రలకోసం వెతికారు. ఎండిన రేగడి, రాళ్ళు రప్పలు ఉన్న నేలపై ప్లగ్ మార్క్స్ పాదముద్రలు లభ్యంకానట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బమ్మెన అటవీ ప్రాంతం సమ్మక్క తల్లి గద్దెల వద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది.


