నేటి నుంచి మూడో విడత
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుంచి షురూ కానుంది. జిల్లాలోని బోథ్, సొనాల, బజార్‌హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని 151 సర్పంచ్‌లు , 1220 వార్డులకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ కోసం ఆయా మండలాల పరిధిలో 37 క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అనుచరులతో కలిసి నామినేషన్లు సమర్పించేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.
ముగిసిన రెండో విడత నామినేషన్ల స్వీకరణ
రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 8 మండలాల్లోని 156 పంచాయతీలు, 1260 వార్డుస్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్ణీత సమయం దాటినప్పటికీ క్యూలో ఉండటంతో వారిని అనుమతించారు. దీంతో ఈ ప్రక్రియ పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. ఆయా మండలాల్లో దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. రెండు రోజుల్లో సర్పంచ్‌లకు 324 నామినేషన్లు రాగా, వార్డు స్థానాలకు 523 నామినేషన్లు అందాయి. చివరి రోజున ఈ సంఖ్య రెట్టింపైనట్లుగా సమాచారం. కాగా బుధవారం ఈ విడతలోని నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సాగనుంది. పోటీకి అర్హులైన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే మొదటి విడతకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. సాయంత్రం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
నేటి నుంచి మూడో విడత


