సన్మార్గంలో సాగితేనే ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్‌టౌన్: ర్యాగింగ్, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లు యువత జీవితాన్ని అంధకారంలోకి నెడుతా యని, వాటి జోలికి వెళ్లకుండా సన్మార్గంలో ముందుకు సాగాలని జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, చెడు అలవాట్లు వ్యక్తిగత ఎదుగుదల, జీవిత వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినా, డ్రగ్స్ వినియోగించినా చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించారు. వైద్య విద్యార్థులు నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. మంచి అలవాట్లు, మంచి స్నేహాలు, మంచి లక్ష్యాలు మాత్రమే ఉజ్వల భవిష్యత్తుకి దారితీస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాజ్యలక్ష్మి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నాగేశ్, రిమ్స్ బోధన, భోదనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


