గ్రంథాలయం.. సమస్యలమయం
విజ్ఞాన భాండాగారాల్లో వసతులు కరువు పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న వైనం చైర్మన్ నియామకమైనా కానరాని పురోగతి ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాలు
ఆదిలాబాద్: గ్రంథాలయాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సాంకేతిక రంగం పురోగమిసు న్నా సరస్వతి నిలయాలు మాత్రం ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. కనీస వసతులూ కరువయ్యా యి. పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాఠకులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ప్రస్తుతం గ్రంథాలయ వారోత్సవాల పేరి ట హడావుడి చేస్తున్న అధికారులు.. నిర్వహణ విషయంలో మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
గ్రంథాలయాలకు నిరుద్యోగుల తాకిడి..
గతంలో గ్రంథాలయాల్లో కథల పుస్తకాలు, నవలలు, ఇతిహాసాలు, వ్యాకరణ గ్రంథాలు వంటి సాహి త్య సంబంధమైన ఎన్నో రకాలైన పుస్తకాలు అందుబాటులో ఉండేవి. అప్పటి పాఠకుల అభిరుచి భి న్నంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఇవి నిరుద్యోగులతో కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువత ఇక్కడ పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే రోజురోజుకు వారి తాకిడి పెరుగుతున్నప్పటికీ దానికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో మాత్రం ముందడుగు పడడం లేదు. ఇప్పటికీ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీలో ఉదయం సమయంలో త్వరగా వస్తేనే స్టడీ చైర్లు దొరికే పరిస్థితి. సౌకర్యాల లేమి కారణంగా సమీపంలోని స్టడీ సెంటర్లలో డబ్బులు వెచ్చించి పలువురు ప్రిపేర్ అవుతుండడం పరిస్థితి తీవ్రత కు అద్దం పడుతోంది. ప్రస్తుత గ్రంథాలయ కార్యాలయం కొనసాగుతున్న మొదటి అంతస్తులో ఉన్న స్టడీ హాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తే పాఠకులు, నిరుద్యోగుల సమస్యలు తీరే అవకాశం ఉంది.
మండలాల్లో మరింత అధ్వానం..
గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆ సంస్థ కార్యదర్శి ఉండే జిల్లా కేంద్ర లైబ్రరీలోనే సమస్యలు వెంటాడుతుండగా.. ఆయా మండలాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. చాలా గ్రంథాలయాలకు సొంత భవనాలు కరువయ్యాయి. దాతలు ముందుకు వచ్చి రెంట్ ఫ్రీ భవనాలు ఇస్తే వాటిలో కొనసాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల రెగ్యులర్ లైబ్రేరియన్ లేక ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారు. పుస్తకాల సంగతి అటు ఉంచితే, చాలా చోట్ల ఒకటి రెండు దినపత్రికలు మాత్రమే అందుబాటులో ఉంచి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయాలు పాఠకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అరకొరగా ఆన్ డిమాండ్ పుస్తకాలు..
గ్రంథాలయం ప్రారంభించినప్పటి పాత పుస్తకాలే చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి. కొత్త పాఠకులు, నిరుద్యోగ అభ్యర్థుల అభ్యర్థనలకు అనుగుణంగా ఆన్ డిమాండ్ పుస్తకాలు తీసుకువస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో సొంత పుస్తకాలే తెచ్చుకుంటున్నారు. కొన్నిచోట్ల తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణాలు సరిపడా లేకపోవడంతో పాఠకులకు తిప్పలు తప్పడం లేదు.


