పత్తి రైతుకు
సీసీఐ మరో మెలిక పంట కొనుగోళ్లలో పరిమితి కుదింపు ఎకరానికి 13 నుంచి ఏడు క్వింటాళ్లకు.. లబోదిబోమంటున్న రైతులు స్లాట్ బుక్ చేసుకున్న వారికీ వర్తింపు మార్కెట్‌కు దిగుబడులు తెచ్చాక లిమిట్ ప్రస్తావన విక్రయించే పరిస్థితులు లేక యార్డులోనే నిరీక్షణ
సాక్షి,ఆదిలాబాద్: భారత పత్తి సంస్థ (సీసీఐ) మరో మెలిక పెట్టింది. ఇప్పటివరకు పత్తిలో తేమ శాతం విషయంలో రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కనీసం 18 శాతం వరకు పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ పట్టించుకోకపోవడంతో కొంతమంది తక్కువ ధరకే ప్రైవేట్‌కు విక్రయించేస్తున్నారు. మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా.. తాజాగా పత్తి రైతులపై మరో పిడుగు పడింది. ఈ సీజన్‌లో కొనుగోళ్లు మొదలైనప్పుడు సీసీఐ నిబంధనల ప్రకారమే ఎకరానికి 13 క్వింటాళ్ల చొప్పున కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. మొదటి రోజు నుంచి రైతులు అలాగే పత్తిని విక్రయించారు. సోమవారం ఉన్నట్టుండి ఎకరానికి ఏడు క్వింటాళ్ల పరిమితి కుదించ డం జరిగిందని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మార్కెట్‌కు తీసుకొచ్చే వరకు తెలియదు..
సీసీఐకి మద్దతు ధరకు విక్రయించేందుకు ముందుగా స్లాట్ బుక్ తర్వాతే పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చే పరిస్థితి ఉండడంతో రైతులు అదే పద్ధతిని అవలంభిస్తున్నారు. పలువురు శుక్ర, శనివారా ల్లో సోమవారం పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో స్లాట్‌లో కూడా ఎకరానికి 13 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయనున్నట్లు సాఫ్ట్‌వేర్‌లో స్పష్టంగా ఉంది. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు ఎలాంటి సందేహం లేకుండా తమ చేతికి అందిన దిగుబడిని యార్డుకు బండ్లలో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కుదించిన విషయం తెలియడం, ఆ లెక్కన తమకున్న భూ విస్తీర్ణం ప్రకారం దిగుబడి అధికంగా ఉండడంతో ఆ మిగిలిన పత్తిని ఏం చేయాలి అనే పరేషాన్‌లో రైతులు పడ్డారు.
అటు వ్యాపారులు.. ఇటు రైతులు
రైతులు పత్తిలో తేమ, పరిమితి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, ఇటు వ్యాపారులు సీసీఐ జిన్నింగ్ మిల్లుల కేటాయింపునలో అవలంభిస్తున్న ఎల్–1, ఎల్–2, ఎల్–3 నిబంధనల కారణంగా అనేక మిల్లులు మూతపడే పరిస్థితి ఉందని వాపోతున్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వీటిని సడలించకపోతే పత్తి కొనుగోళ్లు చేయమని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. ఈనెల 5లోగా సమస్యను పరిష్కరించని పక్షంలో 6నుంచి ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తామని అల్టిమేటమ్ జారీ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోళ్లపై అందరి దృష్టి నెలకొంది.
కాగా పత్తి పరిమితి కుదించిన విషయమై జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్‌ను వివరణ కోరేందుకు పలుమార్లు యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ముందస్తు సమాచారం లేదు..
సీసీఐ నిబంధన మార్పునకు సంబంధించి పత్తి రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. పరిమితి కుదించనున్నట్లు ప్రకటన కూడా చేయలేదు. దీంతో వారు తమ పంట దిగుబడులను బండ్లు మాట్లాడుకొని మార్కెట్‌కు తీసుకువచ్చారు. తీరా విషయం తెలియడంతో మళ్లీ ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. ఓ వైపు పరిమితి కుదించడం, మరోవైపు తేమ శాతం కారణంగా రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. గత్యంతరం లేక కొంతమంది ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించేస్తున్నారు.
పత్తి రైతుకు


