ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా.. మరో అడుగు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. జిల్లా కేంద్రంగా విమానాశ్రయ ఏర్పాటుకు జాతీయ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీనికోసం ఇప్పటికే 362 ఎకరాల భూమి స్థానిక ఎరోడ్రమ్‌లో అందుబాటులో ఉంది. అయితే భారీ పౌర విమానాలు, ఐఏఎఫ్ జెట్లు సైతం ఎగిరేందుకు వీలుగా మూడు కిలోమీటర్ల రన్‌వేతో కూడిన ఎయిర్‌పోర్టుతో పాటు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సైతం ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు అవసరమైన భూమి సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏఏఐ సూచించింది. ఈ మేరకు మరో 700 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి కోసం భూ సేకరణ చేయాలని ఆదేశిస్తూ ఆర్‌అండ్‌బీ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ నుంచి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీ ద్వారా భూ సేకరణ చేయనున్నప్పటికీ దీని పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఈమేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా ఎయిర్‌పోర్టు ఆవశ్యకత, ప్రజల ఆకాంక్షలను చాటేలా ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. అందుకనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వస్తుండడంపై ‘జనం గొంతుక’కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


