ఆ రిజిస్ట్రేషన్లు రద్దు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు వ్యవహారం సంచలనం కలిగిస్తుంది. ఈమేరకు హైకోర్టు స్టే ఇవ్వడంతో భోరజ్ తహసీల్దార్ గిమ్మ గ్రామంలోని 46 ఎకరాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఓ ఆదివాసీ కు టుంబం, బడా వ్యాపారుల మధ్య ఏళ్లుగా సాగిన ఈ భూ వివా దం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.
భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన గెడం అంబుబాయి అనే ఆదివాసీ మహిళకు గ్రామ శివారులోని హత్తిఘాట్‌లో సర్వేనం.41, 41/1, 42/2,42/3 లలో మొత్తం 46 ఎకరాల వ్యవసాయ భూములు ఉండేవి. 2005 సంవత్సరంలో ఆదిలాబాద్‌కు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యాపారి మైనింగ్ కోసం ఈ భూములను ఆ ఆదివాసీ కుటుంబం నుంచి లీజుకు తీసుకున్నాడు. మూడేళ్ల వరకు లీజు డబ్బులు చెల్లించాడని ఆది వాసీ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత లీజు డబ్బులు ఇవ్వడం నిలిపివేశారని, ఈవిషయంలో ప్రశ్నిస్తే.. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆ భూములను తమకు అమ్మివేశారని లీజు దారుడు చెప్పారని ఆరోపిస్తున్నారు. నిరక్షరాస్యులైన తమను ఆ వ్యాపారి మభ్యపెట్టి పవర్ ఆఫ్ అటార్నీ చేసుకున్నారనేది వారి ఆరోపణ. దీనిపై అంబుబాయి 2011 సంవత్సరంలో జిల్లా కోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగింది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే 2018లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో ఈ భూములకు సంబంధించి అంబుబాయి పేరే వచ్చింది. అయితే ఆ భూములను పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా తమకు విక్రయించారని వ్యాపారి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ఆదివాసీ కుటుంబ సభ్యులు నిరక్షరాస్యులైన తమను.. వ్యవసాయ భూములకు సంబంధించి లీజు విషయంలోనే సంతకాలు తీసుకుంటున్నారనుకొని తాము భావించామని, వారు దొంగచాటుగా పవర్ ఆఫ్ అటార్నీ చేసుకోవడం జరిగిందని ఆరోపిస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. దీనిపై హైకోర్టులో వ్యాపారికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ భూముల వ్యవహారం సద్దుమణగలేదు.
అంబుబాయి చనిపోయిన తర్వాత..
ఏళ్లుగా గిమ్మ భూముల వ్యవహారం కోర్టుల చుట్టూ సాగుతుండగా, 2020లో గెడం అంబుబాయి మృతి చెందింది. ఆ తర్వాత 2025 మార్చి 19న వ్యాపారి సంజయ్ కుమార్ ఈ భూములను హైదరాబాద్‌కు చెందిన వినోద్ అగర్వాల్‌కు విక్రయించాడు. గెడం అంబుబాయి ఇది వరకే పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా తమకు భూములను విక్రయించిన దృష్ట్యా తాము ఈ భూ ములను వివిధ కారణాలతో మరో వ్యాపారికి విక్రయించినట్లు వారు స్పష్టం చేశారు. దీనిపై అంబుబాయి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం, తాజాగా దీనిపై హైకోర్టుస్టే విధించింది.
46 ఎకరాల రిజిస్ట్రేషన్లు రద్దు..
హైకోర్టు స్టే ఇవ్వడంతో హత్తిఘాట్‌లో వ్యాపారి వినోద్ అగర్వాల్ పేరిట ఉన్న 46 ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేశాం.
– రాథోడ్ రాజేశ్వరి, తహసీల్దార్, భోరజ్


