‘గులాబీ’ గుబులు
ఇచ్చోడ: పత్తి రైతులను ఈ ఏడాది కష్టాలు వెంటా డుతూనే ఉన్నాయి. పక్షం రోజులుగా పంటకు గులాబీ రంగు పురుగు సోకుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఆలస్యంగా విత్తిన పంట ప్రస్తుతం చేతికందే దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలో కాయలకు గులాబీ పురుగు ఆశిస్తుండడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. ఏకదాటిగా కురిసిన వర్షాలే కారణంగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
దిగుబడిపై ప్రభావం
ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతుండగా.. తాజాగా గులాబీ పరుగు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుపాను ప్రభావం వారిని మరింత కుంగదీస్తోంది. ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా కష్టమే అంటూ వాపోతున్నారు.
లింగాకర్షక బుట్టలు
ఏర్పాటు చేసుకోవాలి
జిల్లాలో పలు ప్రాంతల్లో పత్తి పంటకు గులాబీ రంగు పురుగు సోకుతుంది. కాత, పూత ఉన్న వారు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. అందులో పడ్డ పురుగుల ఆధారంగా మందు పిచికారీ చేసుకోవాలి. చలి పెరుగుతున్న కొద్దీ పురుగు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
– రాజశేఖర్, సీనియర్ శాస్త్రవేత్త


