
సర్వేయర్లు వస్తున్నారు
కైలాస్‌నగర్: లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. తొలి విడత శిక్షణ పూర్తి చేసుకుని అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేయాలని జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు జిల్లాకు సంబంధించిన 45మంది లైసె న్స్‌డ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ ప్రారంభించా రు. గురువారం అభ్యర్థుల పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, ఆధార్‌కార్డు, ఎస్సెస్సీ మెమోలు స్వీకరించారు. వాటి ఆధారంగా లైసెన్స్ పత్రాలు సిద్ధం చేశారు. ఈ నెల 19న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందించనున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 45మంది అర్హులు
జిల్లాలో మొదటి విడత శిక్షణ కోసం 155 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గత మే 26నుంచి జూలై 26వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాత, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించా రు. తొలి విడత పరీక్షలో నలుగురే ఉత్తీర్ణత సాధించగా, సప్లిమెంటరీ పరీక్షల్లో మరో 41మంది పాసయ్యారు. వీరికి 40రోజుల పాటు మండల సర్వేయ ర్ల కింద అప్రెంటిస్‌షిప్ ఇచ్చారు. ఈ శిక్షణ పూర్తి కా గా గత నెల 27న వీరికి అసెస్‌మెంట్ పరీక్ష నిర్వహించారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి సర్వేయర్ లైసెన్స్‌లు అందించాలని నిర్ణయించారు. జీపీవోల తరహాలో వీరిని కూడా రెవెన్యూ క్లస్టర్ల వారీగా నియమించనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా..
ఆ శాఖ రాష్ట్ర కమిషనర్ నుంచి వచ్చిన ప్రొఫార్మా ప్రకారం అభ్యర్థుల వివరాలతో కూడిన లైసెన్స్‌లు రూపొందించారు. అభ్యర్థులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందించనున్నట్లు జిల్లా సర్వేల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ తెలిపారు. వీరి నియామకం ద్వారా జిల్లాలో సర్వేయర్ల కొరత తగ్గి భూముల కొలతల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముంటుందని పేర్కొన్నారు.