‘ఉపాధి’ గ్రామ సభలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ గ్రామ సభలకు వేళాయె

Oct 13 2025 8:38 AM | Updated on Oct 13 2025 8:38 AM

‘ఉపాధి’ గ్రామ సభలకు వేళాయె

‘ఉపాధి’ గ్రామ సభలకు వేళాయె

కై లాస్‌నగర్‌: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వంద రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టాల్సిన పనులు గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణకు సన్నద్ధమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిర్వహించనున్నారు.

ప్రజాభిష్టం మేరకే పనుల ఎంపిక..

ఉపాధి పనుల్లో ప్రజలు, రైతులను భాగస్వాముల ను చేయనున్నారు. వారు కోరిన పనులు కల్పించేలా ప్రభుత్వం ఏటా గ్రామసభలు నిర్వహిస్తోంది. ఈనెల 2నుంచి నిర్వహించాల్సి ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ కారణంగా చేపట్టలేదు. తాజాగా కోడ్‌ ఎత్తివేయడంతో జిల్లాలో రేపటి నుంచి షురూ కానున్నాయి. ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు హాజరై రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై గ్రా మస్తులతో చర్చిస్తారు. గుర్తించిన పనులను కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు చదివి వినిపిస్తారు. తర్వాత ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు వాటికి సంబంధించిన అంచనాలు తయారు చేస్తారు. జాబ్‌కార్డుల ఆధారంగా పనులను నిర్ణయిస్తారు. పంచాయతీల వారీగా నివేదికలను మండల, జిల్లా పరిషత్‌లకు పంపించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాటికి పాలకవర్గాలు లేనందున కలెక్టర్‌కు నివేదిస్తారు. కలెక్టర్‌ వాటిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదిస్తారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక జిల్లాలో ఆయా పనులు చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తారు.

భూగర్భజలాల పెంపు, పండ్ల తోటల పనులకు ప్రాధాన్యం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో ప్రధానంగా భూగర్భజలాలు పెంపొందించడంతో పాటు వ్యవసాయపరంగా రైతాంగానికి మేలు చేకూర్చే పనులకు ప్రాధాన్యతనివ్వాలని అధి కారులు నిర్ణయించారు. నీటి సంరక్షణకు సంబంధించి కుంటలు, చిన్నపాటి చెరువులు, స్టోన్‌ బండింగ్‌, గులకరాళ్ల ఏరివేత, పశువులు, మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకం, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, నర్సరీల ఏర్పాటు రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా మట్టి రోడ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టనున్నారు. వీటితో పాటు రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేలా పండ్లతోటలు, ఈత వనాలను పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ కలిగిన మామిడి, కొబ్బరి, సీతాఫల్‌, జామా వంటి పండ్లతోటల పెంపకంతో పాటు నీలగిరి చెట్ల పెంపకానికి సంబంధించి అంచనాలను రూపొందించనున్నారు. వీటితో పాటు గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వీలుగా వెదురు మొక్కల పెంపకం, అలాగే పాడి ఉత్పత్తి పెంచేలా పశువుల పాకల నిర్మాణాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

వంద రోజులు పని కల్పించడమే లక్ష్యం

వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2026–27)గాను ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై చర్చించి ప్రణాళికను సిద్ధం చేయాల్సి ఉంది. సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నాం. ప్రజలకు అవగాహన కల్పించి ఎలాటి పనులు చేపట్టాలనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకుంటాం. వాటి ఆధారంగా ప్రతీ కూలీకి వంద రోజుల పాటు పని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తాం.

– కుటుంబరావు, అదనపు డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement