
స్వస్థ్ నారీ.. సుస్తీ పరారీ
అక్టోబర్ 2 వరకు జిల్లాలో ప్రత్యేక వైద్యసేవలు ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’కు శ్రీకారం అన్ని పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో అమలు
ఆదిలాబాద్‌టౌన్: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అనారోగ్యం బారిన పడకుండా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు అలసట లే కుండా వివిధ పనులు చేస్తూ నారీమణులు కుటుంబాన్ని ముందుకు నడుపుతుంటారు. అయితే కొంత మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వాటిని లెక్కచేయకుండా మరింత అనారోగ్యం బారి న పడుతున్నారు. ఈ క్రమంలో మహిళల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపుతున్నాయి. వారికి మెరుగైన వైద్యసేవలు, ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్థ్ నారీ– సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బుధవారం వర్చువల్ పద్ధతిలో మధ్యప్రదేశ్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ జయంతి వరకు ఇది కొనసాగనుంది. పట్టణంలోని హమాలీవాడ అర్బన్ హెల్త్‌సెంటర్‌లో కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ నగేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి..
మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఈఎన్‌టీ, కంటి పరీక్షలు, రక్తపోటు, డయాబెటీస్, దంత పరీక్షలు, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, గర్భిణులకు పరీక్షలు, రక్తహీనత పరీక్షలతో పాటు పిల్ల లకు పీడియాట్రిక్ సేవలు అందించనున్నారు. అలాగే చర్మ వ్యాధులు, పల్మనాలజీ, సైకియాట్రీ, క్షయ స్క్రీనింగ్, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలతో పాటు వివిధ రకాల వైద్య సేవలు అందించనున్నారు. దీంతోపాటు ఆరోగ్య నియమాలు, పోషకాహార ఆవశ్యకతను వివరించనున్నారు.
అక్టోబర్ 2 వరకు..
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు యూహెచ్‌సీలు, బోథ్ ఏరియా ఆస్పత్రితో పాటు బస్తీ దవాఖానాల్లో స్వస్థ్ నారీ స్వశక్త్ యోజన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ఆసుపత్రుల్లో ప్రతిరోజు ఒక్కో ప్రత్యేక వైద్య నిపుణులతో మహిళలు, కిశోర బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారు. రిమ్స్, ఉట్నూర్ జిల్లా ఆస్పత్రి వైద్యులతో పాటు ఐఎంఏ వైద్యులు సేవలు అందించనున్నారు. వ్యాధి తీవ్రంగా ఉంటే రిమ్స్‌కు రిఫర్ చేస్తారు. కార్యక్రమం అక్టోబర్ 2 వరకు కొనసాగించనున్నారు.
ఆరోగ్య జీవనశైలి నిర్వహణ..
ప్రస్తుతం అనేక మంది జీవనశైలి కారణంగా వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతం అవుతున్నారు. అయితే ఇల్లాలికి ఆరోగ్యకరమైన జీవనశైలి నిర్వహణను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయనున్నారు. 10 శాతం చక్కెర, వంటనూనె తగ్గించడంతో ఊబకాయం త గ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. స్థానికంగా లభించే ఆహార పదార్థాలను ఇందులో వివరించనున్నారు. శిశు సంరక్షణ, రుతుస్రావం, పోషకాహారం తదితర వాటిపై అవగాహన కల్పించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతంగా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలో 28 ఆస్పత్రుల్లో ప్రతిరోజు ఒక్కో స్పెషలిస్టు వైద్యులతో మహిళలకు వైద్యసేవలు అందిస్తారు. మహిళలు ఆస్పత్రులకు వెళ్లి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో