
ప్రసంగిస్తున్న మహ్మద్ షబ్బీర్ అలీ
పకడ్బందీగా సంక్షేమ పథకాల అమలు
త్వరలో రిమ్స్‌లో క్రిటికల్‌కేర్ ప్రారంభం
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
సాక్షి,ఆదిలాబాద్: ప్రజాపాలనలో ప్రజలే ప్రభుత్వానికి మూలమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో సంస్కరణలు చేపట్ట్టామని అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బుధవారం ఘనంగా నిర్వహించా రు. జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
పారదర్శకత, సమగ్రపాలనపై దృష్టి
ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రజానుకూల పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. పారదర్శకత, సమగ్రపాలనపై దృష్టి సారించడంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. మహిళా సాధికా రత, యువత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతు భరోసాతో చేయూత..
జిల్లాలో రైతుభరోసా పథకం కింద వానాకాలం సీజన్‌లో లక్ష 60 వేల మంది రైతులకు రూ.329.77 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అ లాగే అన్నదాతకు అవసరమైన లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
15వేల ఇందిరమ్మ ఇళ్లు..
ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా పీవీటీజీ, ఎస్టీలకు కలిపి జిల్లాలో 15,402 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు. ఇప్పటివరకు 7,573 మార్కౌట్ చేసినట్లు తెలిపారు. మరో 5,096 నిర్మాణ పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీతో లబ్ధి..
ఆరోగ్యశ్రీతో జిల్లాలో ఇప్పటివరకు 25,051 మందికి వైద్యసేవలు అందించినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.60.89 కోట్ల మేర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ.3.12 కోట్ల నిధులతో నిర్మించిన తలమడుగు, బేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇటీవల ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రిమ్స్‌లో క్రిటికల్‌కేర్ భవన నిర్మాణం రూ.23 కోట్లతో పూర్తి చేశామన్నారు. త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పీఎం జన్‌మన్ పథకం కింద 197 నివాస ప్రాంతాల్లో 13 బృందాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
అంగన్‌వాడీ, జీపీ భవనాలకు నిధులు
ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద 71 అంగన్‌వాడీ సెంటర్ల నిర్మాణానికి రూ.8.52 కోట్లు, 105 గ్రామపంచా యతీ భవనాల నిర్మాణానికి రూ.20.02 కోట్లు మంజూరై పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో భాగంగా పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం కల్పించినట్లు వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ఓవర్సిస్ స్కాలర్‌షిప్ పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమం..
ఆరోగ్యలక్ష్మి పథకం కింద జిల్లాలో 10,483 మంది గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ పౌ ష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద జిల్లాలో ఇప్పటివరకు 41,589 కుటుంబాలకు రూ.388.75 కోట్ల విలువ గల చెక్కులు అందించామన్నారు. భూభారతితో భూ సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన పోషణ మిత్ర పథకాన్ని ప్రారంభించి బాలి కల్లో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వివిధ రకాల రుణాలకు సంబంధించి రూ.60.85 కోట్ల చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ నగేశ్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీ రావు పాటిల్, అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, అదనపు ఎస్పీ సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ కోసం రూ.225.46 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ సలహాదారు తెలిపా రు. పట్టణంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.10.50 కోట్ల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. అమృత్–2 పథకం కింద రూ.95.50 కోట్లతో పట్టణ ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు పనులు చేపడుతున్నట్లు వివరించారు.