రీ ఎంట్రీ.. | - | Sakshi
Sakshi News home page

రీ ఎంట్రీ..

Sep 17 2025 9:02 AM | Updated on Sep 17 2025 9:02 AM

రీ ఎంట్రీ..

రీ ఎంట్రీ..

కాంగ్రెస్‌లోకి ఆ ముగ్గురు బహిష్కృత నేతలు సొంత గూటికి సుజాత, సాజిద్‌, సంజీవ్‌రెడ్డి స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతంపై పీసీసీ దృష్టి

సాక్షి,ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ బహిష్కృత నేతలు గండ్రత్‌ సుజాత, సాజిద్‌ఖాన్‌, సంజీవ్‌రెడ్డి ఎట్టకేలకు సొంత గూటికి చేరారు. గత పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు చేరికల కమిటీ ఆహ్వానం మేరకు అప్పట్లోనే ఈ ముగ్గురు పార్టీలో చేరినా నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి వారి చేరికను విభేదించారు. దీంతో పార్టీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మళ్లీ వారు పార్టీలో చేరడం, తాజాగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తి కలిగిస్తుంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు..

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్‌ విషయంలో కంది శ్రీనివాసరెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేయడంతో సుజాత, సాజిద్‌, సంజీవ్‌రెడ్డి ఒక్కతాటిపైకి వచ్చారు. తమ ముగ్గురిలో ఎవరికై నా ఒకరికి టికెట్‌ ఇవ్వాలని, మిగతా వారు ఆ అభ్యర్థి విజయానికి పాటుపడతామని పార్టీకి తెలియజేశారు. అయితే అధిష్టానం కందికి టిక్కెట్‌ ఇవ్వడంతో ఈ ముగ్గురు పార్టీని వీడారు. స్వతంత్య్ర అభ్యర్థిగా సంజీవ్‌రెడ్డిని అప్పట్లో బరిలో దించారు. అప్పట్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీని వీడిన నేతలు తిరిగి సొంత గూటికి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అయితే ఈ ముగ్గురు కందిని విభేదిస్తూ సంజీవ్‌ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రయత్నం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అటు కాంగ్రెస్‌ అభ్యర్థితో పాటు సంజీవ్‌రెడ్డి కూడా ఓటమి చెందారు. ఈ క్రమంలో ఈ ముగ్గురిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు.

అనూహ్య పరిణామాలు..

కాంగ్రెస్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో పార్టీని వీడిన పాత కాపులను తిరిగి సొంత గూటికి తీసుకోవాలనే విషయంలో అధిష్టానం చర్చించింది. అయితే ఆదిలాబాద్‌ జిల్లా విషయంలో మాత్రం ఇది ముందడుగు పడలేదు. ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పార్టీలో చేరికల కమిటీ ఏర్పాటు చేయడం, పాత నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు కదిలారు. జిల్లా నుంచి ఈ ముగ్గురు నేతలను చేరికల కమిటీ సమక్షంలో పార్టీ కండువా సైతం కప్పుకున్నారు. అయితే అనూహ్యంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పార్టీ పునరాలోచనలో పడి వారి చేరికను ఉపసంహరించుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన తర్వాత ఈ ముగ్గురు ఆచీతూచి వ్యవహరించారు. అన్ని అంశాలు అనుకూలిస్తేనే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపుతో ఈ ముగ్గురూ తిరిగి హస్తం కండువా కప్పుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరి ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ప్రస్తుతం పార్టీలో ఆసక్తికరంగా మారింది.

పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో చేరిక

హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సమక్షంలో ఈ ముగ్గురు మంగళవారం తిరిగి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకే తాము పార్టీలో చేరినట్లు వారు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement