
ఆహారం.. ఆరోగ్యం
నేటి నుంచి పోషణ మాసం గర్భిణులు, బాలింతల ఆరోగ్యమే లక్ష్యం చిన్నారులు, కిశోర బాలికల ఎదుగుదలపై ఫోకస్
ఆదిలాబాద్‌టౌన్: సమతుల ఆహారం.. సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది పోషణమాసం నిర్వహించాలని నిర్ణయించింది. నేటి నుంచి వచ్చే నెల 16 వరకు రోజుకో కార్యక్రమం చొప్పున చేపట్టేందుకు సన్నద్ధమైంది. పోషకాహారం, ఆరోగ్యంపై గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.
పోషకాహారంపై ప్రత్యేక దృష్టి..
బాల్యం బక్కచిక్కుతోంది. బరువుకు తగ్గ ఎత్తు లేకపోవడం.. వివిధ సమస్యలతో చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాగే గర్భిణులు రక్తహీనతతో సతమతం అవుతున్నారు. పోషకాహార లోపం కారణంగా పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉండటం లేదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏటా సెప్టెంబర్‌లో ప్రభుత్వం పోషణ మాసంగా నిర్వహిస్తోంది. నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా నేటి నుంచి షురూ కానుంది.
రోజుకో కార్యక్రమం..
పోషణ మాసాన్ని నేటి నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రోజుకో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో ప్రధానంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, శిశువులకు పోషణపై అవగాహన కల్పిస్తారు. ఈసారి నూనె, చక్కెర వినియోగం తగ్గించడం, పురుషులను వంటకాల్లో భాగస్వాములు చేయించడం, ఆధార్, అపార్‌లను నమోదు చేయించడం వంటివి చేపట్టనున్నారు. వీటితో పాటు చిన్నారుల ఎత్తు, బరువు కొలవడం, ఆహార వంటకాల పోటీలు, బొమ్మల ప్రదర్శన, ముర్రు పాలు పట్టించే విధానంపై బాలింతలకు అవగాహన, చిరుధాన్యాలు, ఆకుకూరల వినియోగం, చిన్నారులకు ఆకలి పరీక్షలు నిర్వహించడం, ఆరోగ్యంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు సన్మానం చేయడం వంటివి చేస్తారు. అలాగే గర్భిణుల గృహ సందర్శన చేసి ఇంటి పురుషులకు అవగాహన కల్పించనున్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల నిర్వహణ, చిన్నారులకు అన్నప్రాసన తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
పోషణ మాసోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. నెలరోజుల పాటు చేపట్టాల్సి ఉంటుంది. రోజుకో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహార విలువలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి నిర్వహించే పోషణ మాసోత్సవంలో నూనె, ఉప్పు వాడకం తగ్గించడం, భర్తలను వంటల్లో భాగస్వాములు చేయడం, ఆధార్, అపార్ ఐడీలను రూపొందించడం ముఖ్య ఉద్దేశం.
– ఫర్హా, సీడీపీవో, ఆదిలాబాద్‌అర్బన్