
పునరుద్ధరణపై ఆశలు
ఆర్టీసీలో యూనియన్లు లేక కార్మికుల తిప్పలు
పని ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన
ప్రభుత్వం స్పందించాలని విన్నపం
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో ఆయా సంఘాలు హ ర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. గత ప్రభుత్వం ఆర్టీసీలో ఉద్యోగ, కార్మిక సంఘాలను తొలగించడంతో అప్పటి నుంచి ఉద్యోగులు ఐకమత్యంగా పోరాడలేని పరిస్థితి. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉన్నతాధికారులకు చెప్పుకోలేని దుస్థితి. సంఘాల స్థానంలో వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ తూతూ మంత్రంగానే అవి పని చేస్తున్నాయనే ఆరోపణలు కార్మికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాల జేఏసీని తిరిగి తీసుకురావడంతో ఆర్టీసీలో సైతం కార్మిక సంఘాలను పునరుద్ధరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.అప్పుడే తమ విజ్ఞప్తులు, ఫిర్యాదులు, సమ స్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావం కార్మిక వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
వినే నాథుడు లేక..
తమ సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెకు దిగారు. ప్రభుత్వం దిగి వచ్చినప్పటికీ కార్మిక సంఘాల రద్దు నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటినుంచి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పుకోలేక కార్మికులు సతమతమవుతున్నారు. తమ సంక్షేమం గురించి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలన్న స్వేచ్ఛ సైతం లేకుండా పోయింది. దీంతో కార్మికులపై ఉన్నత స్థాయి ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ పని ఒత్తిడి పెంచుతున్నారనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. పనిభారం భరించలేక పలు సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
సంఘాలు ఉంటేనే సంఘటిత పోరాటం..
క్షేత్రస్థాయిలో ఏ ఉద్యోగికి ఇబ్బంది కలిగినా సంఘాలు ఉంటే వారంతా ఏకతాటిపైకి వచ్చి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేకపోతే సదరు ఉద్యోగినే టార్గెట్ చేస్తూ కొంత మంది అధికారులు ఒంటెద్దు పోకడలతో వారిపై సస్పెన్షన్ వేటు సైతం వేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో సంఘాల పునరుద్ధరణ జరిగితేనే కార్మికుల గళం సంస్థ దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.