
పర్యాటకులకు నిరాశే..
అక్టోబర్ మొదటివారంలోనే సఫారీ ప్రయాణం ఈనెల 21 నుంచి ముందస్తు దసరా సెలవులు ఏటా జూలై నుంచి సెప్టెంబర్ వరకు అనుమతి నిరాకరణ
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్ జన్నారం అటవీ డివిజన్‌లోని బైసన్‌కుంట, గొండుగూడ బేస్‌క్యాంపు, వాచ్‌టవర్ ప్రదేశాల్లో సఫారీ ప్రయాణం పర్యాటకులకు నిరాశే మిగిలింది. దసరా సెలవులు ముందుగానే ఈనెల 21 నుంచే ప్రారంభమవుతున్నాయి. హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అటవీశాఖ ఇచ్చిన సమయం ప్రకారం అక్టోబర్ మొదటివారంలో సఫారీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఏటా జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు అడవిలోకి వాహనాలను అనుమతించరు. వన్యప్రాణులు ఎదకు వచ్చే సమయంలో అలజడి లేకుండా చూస్తారు. వర్షాల కారణంగా రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే సఫారీ ప్రయాణాన్ని మూడు నెలలపాటు అధికారులు నిషేధిస్తారు.
అనుమతి తప్పనిసరి
పర్యాటక శాఖ రెండు, అటవీశాఖ ఐదు సఫారీలు ఏర్పాటు చేశారు. జూలై నుంచి సెప్టెంబర్‌లో పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దసరా నుంచి మళ్లీ తిరిగి వారి సంఖ్య పెరుగుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సఫారీ ప్రయాణానికి అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అడవిలో పర్యాటకుల కోసం ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశారు.