
జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక
జన్నారం: మండలంలోని మహ్మదబాద్ గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌కుమార్ ఈ నెల 14న నల్గొండలో జరిగిన 12వ సీనియర్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 9 నుంచి 12 వరకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొనున్నాడు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనోహర్ చేతుల మీదుగా బంగారు పతకంతో పాటు ప్రశంసపత్రం అందుకున్నారు.
18న కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
శ్రీరాంపూర్: ఈ నెల 18న బాలబాలికల కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంచందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నస్పూర్ పటేల్ కాలేజీలోని సాధన డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీలో 35వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజమాబాద్ సమీపంలోని ముష్కల్ గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 18న ఉదయం 9 గంటలకు అకాడమీ వద్దకు వచ్చి రిపోర్టు చేయాల్సిందిగా కోరారు. పూర్తి వివరాలకు 99120 29691 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
నేడు, రేపు పాఠశాలల తనిఖీ
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా మంగళ, బుధవారాల్లో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాకు వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారిని నియమించారు. పది పాఠశాలలను పర్యవేక్షించి 23 అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. వీటిలో విద్యార్థుల నమోదు, ప్రీప్రైమరీ స్కూల్, యూడైస్, అపార్, విద్యార్థుల సామర్థ్యాలు, కంప్యూటర్ల మరమ్మతులు, పారిశుధ్యం, ఎఫ్‌ఆర్‌ఎస్, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాల సరఫరా, పాఠశాలలో మౌలిక వసతులు, పెండింగ్‌లో ఉన్న పనులు, ఎఫ్‌ఎల్‌ఎం, పీఎం పోషణ్, పీఎంశ్రీ, భవిత సెంటర్లు, క్లాస్‌రూమ్ ట్రాన్‌జాక్షన్ తదితర అంశాలను పరిశీలించి లోపాలను పాఠశాల డైరెక్టర్‌కు నివేదించనున్నారు. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల, ఉపాధ్యాయుల పనితీరు తేటతెల్లం కానుంది. ఏయే పాఠశాలలను తనిఖీ చేస్తారనేది అప్పటికప్పుడే నిర్ణయించనున్నారు. వీరి వెంట జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు మండల విద్యాశాఖాధికారులు, సెక్టోరియల్ అధికారులు ఉండనున్నారు.
పాత నేరస్తుడి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన పాత నేరస్తుడు ఎస్‌డీ ముషరఫ్ అలియాస్ బడా ముషరఫ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ తెలిపారు. నిందితుడిపై గంతలో గంజాయి, దొంగతనం కేసులు ఉండగా చిల్కూరి లక్ష్మీనగర్‌లో దొంగతనానికి పాల్పడ్డ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. నిందితునికి గంజాయి పరీక్ష నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు.