
భూ రికార్డుల తరలింపు
కై లాస్‌నగర్: సర్వే ల్యాండ్ రికార్‌ుడ్స శాఖకు సంబంధించిన భూ రికార్డుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల పునర్విభజన జరిగి తొమ్మిదేళ్లు గడుస్తున్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన రికార్డుల నిర్వహణ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగానే కొనసాగుతోంది. అయితే ఇటీవల కలెక్టరేట్ ఏ బ్లాక్ అంతస్తు పైకప్పు కూలిన నేపథ్యంలో అక్కడి కార్యాలయాల తరలింపు అనివార్యంగా మారింది. దీంతో ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లాగా కొనసాగిన భూ రికార్డులు, దస్త్రాల తరలింపును ఆయా జిల్లాలకు తరలించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన భూ రికార్డులను ఆయా జిల్లాలకు తరలించారు. తాజాగా నిర్మల్ జిల్లాకు సంబంధించిన భూ రికార్డులను సోమవారం ప్రత్యేక వాహనంలో తరలించారు. భూమికి సంబంధించిన నక్షలు, టిప్పన్‌లు, తదితర రికార్డులను ఆ జిల్లాకు సంబందించిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు తీసుకెళ్లారు. ఎంతో కీలకమైన ఈ భూ రికార్డుల తరలింపులో సంబంధిత శాఖాధికారులు అందుబాటులో ఉండకుండా కేవలం తాత్కాలిక అప్రెంటిస్‌షిప్‌లో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్లపై ఆధారపడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఎమైనా రికార్డులు తప్పిపోతే బాధ్యులేవరనే ప్రశ్నలు తలెత్తాయి. అధికారులు దగ్గరుండి తరలించాల్సిన రికార్డులను కేవలం అప్రెంటిస్ సిబ్బందిపై ఆధారపడి తరలించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.