
యాత్రాదానానికి దాతలు ముందుకు రావాలి
ఆదిలాబాద్: ఆర్టీసీ ప్రారంభించిన యాత్రా దానం కార్యక్రమానికి విరాళాలు ఇవ్వడానికి దాతలు ముందుకు రావాలని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.భవానీ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఈ నూతన కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వ్యక్తుల పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాల వంటి ప్రత్యేకమైన రోజుల్లో అనాధలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థుల యాత్రలకు ఈ కార్యక్రమాల ద్వారా విరాళాలు అందించవచ్చన్నారు. వీరందరినీ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళ్లడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రత్యేక రోజున అవసరమైన విరాళాన్ని సంస్థకు అందిస్తే ఆర్టీసీ ఎంపిక చేసిన ప్రయాణికులకు బస్సు సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్నారైలు, సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో విరాళం చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. దాతలు చెల్లించే విరాళానికి అనుగుణంగా కిలోమీటర్ల ప్రాతిపదికన విహారయాత్రలకు ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. సరికొత్త కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా దాతలు ముందుకు రావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో 9959226002, నిర్మల్ డిపో పరిధిలో 9959226003, భైంసా డిపో పరిధిలో 99592 26005, ఆసిఫాబాద్ డిపో పరిధిలో 995926006, మంచిర్యాల డిపో పరిధిలో 9959226004 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.