
● చారిత్రక సాక్ష్యాలు.. ఈ నిర్మాణాలు
వరదలను తట్టుకుని
నిలిచిన ‘కడెం’
కడెం: నిర్మల్, మంచిర్యాల జిల్లాల వరప్రదాయిని కడెం ప్రాజెక్ట్. 18 గేట్లున్న దీని పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం దీని సామర్థ్యం 4.699 టీఎంసీలు మాత్రమే. కుడి, ఎడమ కాలువల ద్వారా నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట్, హాజీపూర్ మండలాల్లోని 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తుంది. గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై 1949లో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. 1958లో 9 జర్మనీ టెక్నాలజీ గేట్లతో నిర్మాణం పూర్తయింది. 1958 ఆగష్టులో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్ట్ తెగిపోయింది. అవుట్‌ఫ్లో సామర్థ్యం పెంచేందుకు 1969లో మరో 9 ఇండియన్ గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 1995, 2022, 2023లో ప్రాజెక్ట్ సామర్థ్యానికి మించి భారీ స్థాయిలో(5లక్షల క్యూస్కెకులకు పైగా) ఇన్‌ఫ్లో వచ్చి గేట్లపై నుంచి వరద పారినా ఏమీ కాలేదు. అప్పటి ఇంజినీర్ల నైపుణ్యంతో నేటికీ కడెం ప్రాజెక్ట్ చెక్కుచెదరకుండా నిర్మల్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి అండగా నిలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో నిజాం, నిమ్మల రాజుల హయాంలో నిర్మించిన పలు కట్టడాలు చారిత్రక సాక్ష్యాలు గా దర్శనమిస్తున్నాయి. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరని ఆ నిర్మాణా లు నాటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తున్నాయి. భారీ వరదలను సైతం తట్టుకుని నిలిచిన కడెం ప్రాజెక్టు ఇందులో ప్రత్యేకం. ఇక ఆదిలాబాద్‌లోని మావల చెరువు గ్రావిటీ స్పెషల్‌గా.. ఖానాపూర్‌లోని సదర్‌మాట్ ఆనకట్ట వారసత్వ కట్టడంగా నిలుస్తున్నాయి. నిర్మల్ బురుజులు, కోటలు, నస్పూర్‌లోని గడి, ఆసిఫాబాద్‌లోని జిల్లా జైలు నాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటుతున్నాయి. నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే..
కడెం చాలా పురాతన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసిన ఆనాటి ఇంజినీర్ల ప్రతిభతో నేటికీ ఆయకట్టుకు సాగునీరందిస్తోంది. భారీ వరదలనూ తట్టుకుని నిలవడం అప్పటి ఇంజినీర్ల గొప్పతనమే.
– ప్రవీణ్, ఈఈ కడెం

● చారిత్రక సాక్ష్యాలు.. ఈ నిర్మాణాలు