
టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం అన్నారు. పట్టణంలోని హిందీ హైస్కూల్‌లో ఇటీవల పదోన్నతులు పొందిన, ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న టీచర్లను ఆదివారం శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని చెప్పడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. ఏ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు అదే సబ్జెక్టు టెట్ రాసే వీలు ఉండాలని పేర్కొన్నారు. అర్హత మార్కుల్లో కులాల వారీగా కాకుండా అందరికీ 40 శాతం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలెందర్ రెడ్డి, బలిరాం జాదవ్, గండ్రత్ నారాయణ, అరుణ తదితరులు పాల్గొన్నారు.