
పెన్‌గంగ భవన్‌కు కలెక్టరేట్..?
కై లాస్‌నగర్: నిజాం హయాంలో నిర్మించి సుమారు ఏడున్నర దశాబ్దాల పాటు జిల్లా పాలనకు వేదికై న కలెక్టరేట్ భవనం ఇక చరిత్రకు సాక్ష్యంగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. శిథిలావస్థకు చేరిన ఈ భవనంలోని ఏ సెక్షన్ బ్లాక్ బాల్కనీ గురువారం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో పాటు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భవనాన్ని ఆర్‌అండ్‌బీ శాఖ సీఈ రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. కార్యాలయ ముందరి భాగం పటిష్టంగానే ఉన్నట్లుగా భావించినా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తరలించడమే ఉత్తమమని కలెక్టర్‌కు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంజినీరింగ్ అధికారుల బృందం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కూడా తరలింపే ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాలతో కలెక్టరేట్‌లోని ఆయా విభాగాల అధికారులు నిర్వహణకు అనువైన భవనాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారం కొన్నింటిని పరిశీలించి ఫైనల్ కూడా చేశారు. అయితే కలెక్టరేట్ తరలింపుపై మాత్రం రేపటి వరకు స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
జిల్లా పాలనకు కేంద్రబిందువైన కలెక్టరేట్‌ను తాత్కాలికంగా పక్కనే ఉన్న ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పెన్‌గంగ భవన్‌కు మార్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధునాతన వసతులతో కూడిన ఈ భవనం ఇటీవలే నిర్మించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ చాంబర్లతో పాటు అన్ని సెక్షన్ల నిర్వహణకు అనుకూలంగా ఉండనున్నట్లుగా భావిస్తున్నారు. పైగా ప్రస్తుత కలెక్టరేట్‌కు ఆనుకునే ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సైతం అందుబాటులో ఉండనుంది. కలెక్టర్ నిర్ణయం మేరకు కార్యాలయ తరలింపు సోమవారం వరకు స్పష్టతవచ్చే అవకాశముంది.
కలెక్టరేట్ మార్గాల మళ్లింపు..
కలెక్టరేట్‌లో కూలిన శిథిలాల తొలగింపు పూర్తి కానందున ప్రజల భద్రత దృష్ట్యా ప్ర వేశ, బయటికి వెళ్లే మార్గాలను మార్చినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అధికారిక కార్యక్రమాల కోసం సీపీవో, డీసీవో కార్యాలయం, కలెక్టర్ సమావేశ మందిరం, ఎస్‌బీఐ వైపు నుంచి ట్రెజరీ కార్యాలయానికి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. వెనుక వైపు నుంచి ఉన్న ర్యాంపు ద్వారా డీపీఆర్వో కార్యాలయం, ఆధార్ కేంద్రానికి అనుమతించనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజలు పోర్టికో/మెయిన్ డోర్ ద్వారా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సహకరించాలని కలెక్టర్ కోరారు.