
అజ్ఞాతంలోనే ముగిసిన వెంకటి ప్రస్థానం
బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్: విప్లవ సిద్ధాంతానికి ఆకర్షితుడైన బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన జాడి వెంకటి అలియాస్ భిమల్ అలియాస్ సురేష్(56) విప్లవ ప్రస్థానం అజ్ఞాతంలోనే ముగిసింది. గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబండ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన పది మంది మావోయిస్టుల్లో వెంకటి ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు. 30ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా విప్లవ కార్యకలాపాలు సాగించాడు. 1996 ప్రాంతంలో అజ్ఞాతంలోకి వెళ్లి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ప్రింటింగ్ ప్రెస్, ఇతర కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఆయుధాల సామగ్రిని వివిధ ప్రాంతాల నుంచి రవాణా చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచాడు. మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్ ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. తెలంగాణలో కార్యకలాపాలు సాగించకపోవడం, హింసాత్మక కార్యకలాపాల్లో వెంకటి భాగస్వామ్యం అంతంత మాత్రం కావడంతో ఆయన పేరు స్థానిక పోలీసు రికార్డుల కెక్కలేదు. 15ఏళ్ల క్రితం ఝార్ఖండ్ రాష్ట్రం రూర్కేలాలో ఓసారి పోలీసులకు పట్టుబడ్డాడు. మూడేళ్ల జైలు జీవితం తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకే వెళ్లాడు. ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. ఎన్‌కౌంటర్‌లో మృతితో రహస్య జీవితం ముగిసింది. వెంకటిపై ఆయా రాష్ట్రాల్లో రూ.10లక్షల రికార్డు ఉంది. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
పీపుల్స్‌వార్ సానుభూతి పరుడిగా...
బెల్లంపల్లి బస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(అద్దాలబడి)లో వెంకటి పదో తరగతి వరకు చదివాడు. 1985లో తన గ్రామానికి చెందిన పుష్పను ప్రేమించి శివాలయంలో పెళ్లి చేసుకున్నాడు. గ్రామ సుంకరిగా పని చేస్తూనే వ్యవసాయం చేసేవాడు. పీపుల్స్‌వార్, సికాస సానుభూతి పరుడిగా ఉన్న అతడిపై పోలీసులు ప్రత్యేక నిఘాతో వేధింపులకు గురి చేశారనే ప్రచారం ఉంది. దీంతో ఏడాదిపాటు బెల్లంపల్లి అంబేడ్కర్‌నగర్‌లో మకాం పెట్టాడు. అయినా పోలీసుల వేధింపులు ఆగకపోవడంతో భార్య పుష్పతో కలిసి దండకారణ్యంలోకి వెళ్లాడు. ఆమె టెక్నికల్ టీంలోనే సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం.
తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు
జాడి పోశమ్మ, ఆశయ్య దంపతులకు ముగ్గురు సంతానం కాగా.. ఇద్దరు కుమార్తెలు రామక్క, సుజాత, కుమారుడు వెంకటి ఉన్నారు. వీరిలో రామక్క కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో, తల్లిదండ్రులు 15ఏళ్ల క్రితం వృద్ధాప్యంతో చనిపోయారు. తల్లిదండ్రులు మృతిచెందిన సమయంలోనూ అంత్యక్రియలకు రాలేదు. తల్లిదండ్రులు నివాసం ఉన్న ఇల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయింది. ఆశయ్య సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పనిచేశాడు.