
ఎస్‌బీఐలో గోల్డ్ లోన్ మోసం
నిర్మల్ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్‌బీఐలో ఇటీవల క్యాషియర్ భారీగా ఆభరణాలు అప్పగించాడు. రెండు రోజుల క్రితమే పోలీసులు రికవరీ చేశారు. తాజాగా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో గోల్డ్‌లోన్ మోసం జరిగింది. ఈ మోసం శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్(జి)కి చెందిన ప్రశాంత్ అనే యువకుడు స్థానిక ఎస్‌బీఐలో గోల్డ్‌లోన్ అప్రైజల్‌గా పనిచేస్తున్నాడు. ప్యూరిటీ తక్కువగా ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 12 మంది స్నేహితులు, ఇతరుల పేర్ల మీద రుణాలు ఇప్పించాడు. ఇందుకు వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. శుక్రవారం బ్యాంకుకు వచ్చిన ఆడిట్ అధికారులు గోల్డ్‌లోన్ వివరాలను పరిశీలించగా తక్కువ ప్యూరిటీ ఉన్న ఆభరణాలు తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో బ్యాంకు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆభరణాల తనఖాపై తీసుకున్న మొత్తం విలువ రూ.23 లక్షల వరకు ఉంటుందని బ్యాంకు మేనేజర్ ఎస్.రవి తెలిపారు. 12 మందిని పిలిపించి విచారించగా వారిలో నలుగురు తీసుకున్న రుణం చెల్లించారు. మిగతా 8 మందికి శనివారం వరకు గడువు ఇచ్చినట్లు మేనేజర్ తెలిపారు.