
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
బోథ్: ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం బోథ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రూ.4.15 కోట్లతో నిర్మించిన వసతి గృహాన్ని ఎంపీ నగేష్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని పరిచయ ఫంక్షన్ హాల్‌లో వివిధ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని, పొచ్చెర క్రాస్‌రోడ్డు నుంచి బోథ్ వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయాలని, కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలను అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. మంత్రి మాట్లాడుతూ సమస్యలపై తాను హామీలు ఇవ్వలేనని.. ప్రయత్నం మాత్రం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, సలోని చాబ్రా, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఆర్డీవో స్రవంతి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పేదల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యం
సాత్నాల: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భోరజ్ మండలం పిప్పర్‌వాడలో ఇందిరమ్మ మోడల్ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
ఇంద్రవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ విఠల్‌తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖడే ఉత్తం, తదితరులు పాల్గొన్నారు.
బాధిత రైతాంగానికి న్యాయం చేస్తా
కై లాస్‌నగర్: భారీ వర్షాలతో పంట నష్టపోయిన బాధిత రైతాంగానికి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో వరద నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 12,775 మంది రైతులకు సంబంధించి 17,490 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రోడ్లు, వంతెనల మరమ్మతులు, కొత్త వాటి నిర్మాణాలకు అవసరమైన నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలో ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, తదితరులు పాల్గొన్నారు.