
చెరువుకు చేరని చేప
‘మీనం’ టెండర్లలో తీవ్ర జాప్యం ముందుకు రాని కాంట్రాక్టర్లు ఈనెల 12 వరకు ‘మూడోసారి’ అవకాశం ఇప్పటికే చేపపిల్లల పంపిణీ ఆలస్యం మత్స్యకారులకు తప్పని నిరీక్షణ
కై లాస్‌నగర్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది జిల్లాలోని మత్స్యకారుల పరిస్థితి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జ లకళ సంతరించుకున్నాయి. వాటిలో చేపపిల్లలను వదిలేందుకు అనుకూలమైన పరిస్థితులున్నాయి. అయితే సీడ్ సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం వారిని నిరాశకు గురిచేస్తోంది. ముచ్చటగా మూడోసారైనా టెండర్లు ఖరా రై మీనం త్వరగా చెరువుకు చేరుతుందా.. లేక మళ్లీ వాయిదా తప్పదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
వంద శాతం పంపిణీకి నిర్ణయం
మత్స్యకారుల ఉపాధికి అండగా నిలవాలని భావించిన ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపపిల్లలను వదులుతుంది. చెరువుల్లో 35 నుంచి 45 మిల్లీమీటర్ల సైజ్‌తో కూడిన కట్ల, రవ్, బంగారుతీగ చేపలను వదలనుండగా, సాత్నాల, మత్తడివాగు వంటి ప్రాజెక్టుల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల సైజుతో కూడిన కట్ల, రవ్, మృగాల వంటి చేపలను వదులుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 87లక్షల చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయగా వివిధ కారణాలతో ప్రభుత్వం అందులో సగం 43లక్షలు మాత్రమే వదిలింది. లక్ష్యం తగ్గిపోవడంతో పూర్తిస్థాయి చెరువుల్లో కాకుండా కేవలం 126 చెరువుల్లో మాత్రమే వదిలారు. టెండర్ల ప్రక్రియ ఆలస్యం కావడం, ఆలస్యంగా సీడ్ వదలడంతో చేప పిల్లలు చనిపోయి కేవలం 30 శాతం మాత్రమే పంపిణీ జరిగినట్లుగా మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఈఏడాది అలాంటి పరిస్థితికి తావివ్వకుండా 1.16 కోట్ల చేప పిల్లలను వదలాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేయగా ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపింది.
ముందుకు రాని కాంట్రాక్టర్లు..
ఆయా జలాశయాల్లో వదిలేందుకు అవసరమైన చేపపిల్లల సీడ్ సరఫరా చేసేందుకోసం ప్రభుత్వం ఏటా మే నెలలో టెండర్లు నిర్వహిస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటికి రెండుసార్లు టెండర్లను ఆహ్వానించగా ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. మొదటి సారి కేవలం ఒకే ఒక బిడ్ దాఖలైంది. రెండోసారి కాంట్రాక్టర్ల నుంచి స్పందన కొరవడంది. ఒక్కరుకు కూడా ముందుకు రాలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి టెండర్ల నిర్వహణకు ఆదేశించింది. ఈమేరకు అధికారులు ఆ దిశగా కసరత్తు చేపట్టారు. టెండర్ దాఖలకు ఈనెల 12 వరకు గడువు విధించారు. అయితే గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చేపల ఎదుగుదలపై ప్రభావం
సహజంగా ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వది లితే అవి మార్చి నాటికి ఎదిగి విక్రయించేందుకు అనుకూలంగా ఉంటాయని మత్స్యకారులు చెబు తున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ వచ్చినా టెండర్ల ప్ర క్రియ ఖరారు కాలేదని, అక్టోబర్, నవంబర్‌లో వదిలితే వేసవి వరకు అవి ఎదగవని, తద్వారా నష్ట మే వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసి త్వరితగతిన చెరువుల్లోకి మీనం చేర్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో..
మత్స్యపారిశ్రామిక సంఘాలు : 107
ఆయా సంఘాల్లోని సభ్యులు : 5,040 మంది
మొత్తం చెరువులు : 224
ప్రాజెక్టులు : 2(సాత్నాల, మత్తడివాగు)
చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 1.16కోట్లు
35–40 ఎంఎం సైజ్ : 83 లక్షలు
90–100 ఎంఎం సైజ్ : 33లక్షలు
కాంట్రాక్టర్లు ముందుకొస్తేనే
జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో ప్రభుత్వం ఈ ఏడాది వందశాతం చేపపిల్లల సీడ్ పంపిణీకి అనుమతి ఇచ్చింది. దీంతో కోటి 16లక్షల సీడ్ సరఫరా కోసం టెండర్లు ఆహ్వానించాం. ఇప్పటికి రెండు సార్లు పిలువగా ఒకే బిడ్ దాఖలైంది. తాజాగా మూడోసారి ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 12వరకు దాఖలు చేయవచ్చు. టెండర్లు ఖరారైన వెంటనే సీడ్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
– భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి