
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
ఉట్నూర్‌రూరల్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని, ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరాల నియంత్రలో భాగంగా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ కెమెరాలతో పాటు ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఐటీడీఏ పీవో సహకారంతో ఉట్నూర్‌లో 37, ఇంద్రవెల్లిలో 13 సీసీ కెమెరాలను ప్రధానమైన కూడళ్లలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక సిబ్బంది 24 గంటలు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీంతో ఉట్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాలు ఇక నిఘా నీడలో ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, నార్నూర్ సీఐ ప్రభాకర్, ఎస్సైలు ప్రవీణ్, అఖిల్, మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.